అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BC Reservations | స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో ఆమోదించిన రెండు బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Reservations) రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని పరిమితి విధిస్తూ చేసిన చట్టాన్ని సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌కు కూడా ఆమోద ముద్ర వేయాలని విజ్ఞప్తి చేశారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావడానికి టీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీ (Delhi)లోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఈ ధర్నాలో పార్లమెంట్లో ఇండియా కూటమి (India Alliance)కి చెందిన పలువురు ఎంపీలు పాల్గొని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు.
BC Reservations | దేశానికి రోల్‌మోడల్‌గా తెలంగాణ
దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో కులగణన (Caste Census) తెలంగాణ నమూనా దేశానికి రోల్ మాడల్‌గా నిలుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బీసీ రిజర్వేషన్లను సాధించుకోవడానికే సడక్ నుంచి సంసద్ వరకు వచ్చామన్నారు. యావత్ దేశం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోందని చెప్పారు. తెలంగాణ శాసనసభ చేసిన బిల్లులు, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ గవర్నర్ ద్వారా రాష్ట్రపతి గారికి చేరి నాలుగు నెలలైనా ఆమోదముద్ర పడలేదన్నారు. ఈ నేపథ్యంలోనే చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. రిజర్వేషన్లు సాధించే వరకు నిద్రపోమని ఆయన పేర్కొన్నారు.
ఈ ధర్నాలో డీఎంకే, సమాజ్ వాది, ఎన్సీపీ, శివసేన, సీపీఎం తదితర పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు పాల్గొని మద్దతును ప్రకటించారు. తెలంగాణ నేతలు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.