అక్షరటుడే, వెబ్‌డెస్క్: BC Reservations | స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) కల్పిస్తూ రాష్ట్ర మంత్రిమండలి (State Cabinet) తీర్మానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీసీ సంఘాల నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) శుక్రవారం కలిసి కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో వివిధ బీసీ సంఘాల నాయకులు జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు.
సంబంధిత చట్ట సవరణకు ఆర్డినెన్స్ జారీ చేసి బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయంపై ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (TGMDC) ఛైర్మన్ ఈరవత్రి అనిల్, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. తాము అధికారంలోకి వస్తే స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. అయితే కేంద్రం ఆ బిల్లుకు ఆమోదం తెలపకపోవడంతో ఆర్డినెన్స్ (Ordinance) ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి గురువారం జరిగిన మంత్రివర్గంలో తీర్మానం చేశారు. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు జరిపి చట్ట సవరణ చేపట్టనుంది.