అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BC Bandh | రాష్ట్రవ్యాప్తంగా బీసీ బంద్ విజయవంతంగా సాగుతోంది. బంద్ ప్రభావంతో బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో దీపావళికి సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారు ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్ (Hyderabad) తో పాటు వివిధ నగరాలు, పట్టణాల్లో స్థిర పడిన వారు దీపావళికి స్వగ్రామాలకు వెళ్లాలని ప్లాన్ వేసుకున్నారు. దీపావళి పండుగ (Diwali Festival) సోమవారం ఉంది. శని, ఆదివారాలు కలిసి రావడంతో మూడు రోజులు ఇళ్లకు వెళ్లాలని యోచించారు. శనివారం సెలవు లేని వారికి బంద్ రూపంలో హాలీడే కలిసి వచ్చింది. దీంతో ఊళ్లకు వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారు. కానీ రవాణా వ్యవస్థ స్తంబించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
BC Bandh | హైదరాబాద్‌లో..
హైదరాబాద్‌లో నిత్యం బస్సులు, ప్రయాణికులతో రద్దీగా ఉండే ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు బీసీ బంద్ (BC Bandh)తో బోసిపోయి కనిపిస్తున్నాయి. అయితే పండుగకు ఇళ్లకు వెళ్లాలి అనుకునే వారు బస్టాండ్ బయట వేచి చూస్తున్నారు. బస్సులు కదలక పోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. బంద్‌ను ఆసరాగా చేసుకొని ప్రైవేట్ వాహనాల డ్రైవర్లు ప్రయాణికులను దోపిడీ చేస్తున్నారు. రెండింతల ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఎల్బీ నగర్ (LB Nagar) నుంచి సూర్యాపేటకు మామూలు రోజుల్లో రూ.200 ఛార్జీ ఉంటుంది. ప్రస్తుతం ప్రైవేట్ కార్ల డ్రైవర్లు రూ.800 డిమాండ్ అడుగుతున్నారు. చేసేదేమి లేక ప్రయాణికులు వారు అడిగినంత ఇచ్చి ఊళ్లకు వెళ్తున్నారు.