అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IMD Rain Alert | బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ (Meteorological Department) హెచ్చరిక జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంతో పాటు భూమధ్యరేఖకు ఆనుకుని హిందూ మహాసముద్రంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
తమిళనాడు (Tamil Nadu), కేరళలోని దక్షిణ ప్రాంతాల్లో రేపటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. అలాగే ఆంధ్ర ప్రదేశ్‌లోనూ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. రాయలసీమ, దక్షిణ తీర ప్రాంతాలకు వర్ష సూచన చేసింది. ఈ నెల 22 నుంచి దక్షిణ తీరప్రాంతంలోని అనేక జిల్లాల్లో వర్షాలు (Heavy Rains) పడే అవకాశం ఉందని పేర్కొంది.
IMD Rain Alert | తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు
అల్పపీడనం ముందుకు సాగుతూ బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఫిబ్రవరి 21 నుంచి వర్షాలు ప్రారంభమై రెండు మూడు రోజులు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.
IMD Rain Alert | ఏపీలోనూ..
ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో కూడా అల్పపీడనం కారణంగా చెదురుమదురు జల్లులు కురువొచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది. రాయలసీమ ప్రాంతాల్లో ఫిబ్రవరి 21న, ఇక దక్షిణకోస్తా ప్రాంతాల్లో ఫిబ్రవరి 22న వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
IMD Rain Alert | తెలంగాణ జిల్లాల్లోనూ కురిసే ఛాన్స్
తెలంగాణ (Telangana)లో కూడా ఫిబ్రవరి 22 నుంచి అల్పపీడనం ప్రభావం కనిపిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఫిబ్రవరి 23, 24 తేదీల్లో వరంగల్, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్ జిల్లాల్లో చిరుజల్లులు పడవచ్చని చెప్పింది.
IMD Rain Alert |తగ్గుతున్న చలితీవ్రత
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చలి తీవ్రత క్రమంగా తగ్గుతోంది. దీంతో పాటు ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే వేసవికాలం ప్రారంభమైన సూచనలు కనపడుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో వేడిగాలులు వీస్తున్నాయి. మార్చి మొదటి వారంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.