అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad city | నిజామాబాద్ నగరంలో అర్ధరాత్రి వ్యాపారాలపై సీపీ సాయిచైతన్య ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. రాత్రి 11 దాటితే హోటళ్లు నడపరాదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించిన పలువురిని అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు సైతం తరలించారు. కానీ వినాయక్‌నగర్‌లోని ఓ హోటల్ నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రిళ్లూ తెరిచి ఉంటుంది.
నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో గల బావర్చి హోటల్ అర్ధరాత్రి వరకు నడుస్తోంది. రైల్వే క్యాటరింగ్ పేరిట రాత్రిళ్లు తెరిచి ఉంచేందుకు అనుమతి తీసుకున్న నిర్వాహకులు.. మరోవైపు హోటల్‌ను నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారు. వాస్తవానికి రైల్వే కాటరింగ్ అంటే ఆ సమయంలో వచ్చి వెళ్లే రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం భోజనాన్ని సమకూర్చాల్సి ఉంటుంది. అది కూడా హోటల్లో కూర్చోబెట్టి వడ్డించేందుకు అనుమతి లేదు. ఈ నిబంధనలు తుంగలో తొక్కి హోటల్ నిర్వాహకులు దర్జాగా అర్ధరాత్రిళ్లు బిర్యానీ బిజినెస్ నడుపుతున్నారు.
Nizamabad city | మందుబాబులకు అడ్డాగా..
నగరంలోని కొందరు యువత అర్ధరాత్రి వరకు మద్యం తాగి రోడ్లపై తిరుగుతున్నారు. కొందరు మద్యం మత్తులో వాహనాల్లో తిరుగుతూ బీరు, బిర్యానీ వేటలో ఉంటున్నారు. ఇలాంటి వారందరికీ ఈ హోటల్ ఓ అడ్డాగా మారిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. రాత్రి 10.30 గంటలు దాటితే నగరంలోని అన్ని హోటళ్లు మూసి ఉంటున్నప్పటికీ కేవలం ఈ ఒక్క హోటల్ మాత్రం తెరిచి ఉంటోంది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి యువత, మందుబాబులు వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడే తిష్ట వేస్తున్నారు. గతంలో ఈ హోటల్ సమీపంలో మందుబాబులు గొడవలకు దిగిన సందర్భాలూ లేకపోలేదు.
Nizamabad city | చర్యలేవి..!
నిబంధనలకు విరుద్ధంగా ఈ హోటల్ నడుస్తోంది. రైల్వే ప్రయాణికుల కోసం అనుమతి తీసుకుని కేవలం స్థానికంగా ఉండేవారికి మాత్రమే విక్రయిస్తూ బిజినెస్ సాగిస్తున్న హోటల్‌పై చర్యలు తీసుకునేందుకు పోలీసులు ససేమీరా అంటున్నారు. ఈవిషయమై పలు హోటళ్ల నిర్వాహకులు సైతం ఫిర్యాదు చేసిన దాఖలాలు ఉన్నాయి. నిబంధనలు అతిక్రమించి అర్ధరాత్రి పూట హోటల్ నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.