అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nepal Protest | నేపాల్ (Nepal)లో సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. సోషల్ మీడియా (Social Media) యాప్‌లను ప్రభుత్వం నిషేధించడంతో యువత లేవనెత్తిన తిరుగుబాటు తీవ్ర హింసాత్మకంగా మారింది.
పార్లమెంట్‌లోకి చొచ్చుకొచ్చేందుకు ఆందోళనకారులు యత్నించడంతో పోలీసులు రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 14 మంది మృతి చెందగా, వంద మందికి పైగా గాయపడడ్డారు. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. అలాగే కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు జారీ చేసింది.
Nepal Protest | సోషల్ మీడియాపై బ్యాన్
నేపాల్ ప్రభుత్వం (Nepal Govt) సోషల్ మీడియా నిబంధనలను సవరిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. వీటిని అన్ని సోషల్ మీడియా యాప్స్ ఖచ్చితంగా అమలు చేయాలని అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. ఇందుకోసం కొంత సమయం ఇచ్చింది. అయితే 26 ప్రముఖ సోషల్ మీడియా యాప్స్ నేపాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల్ని అనుసరించకుండా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. దీంతో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఎక్స్, లింక్డ్ఇన్, ఫేస్బుక్, సిగ్నల్ తో పాటు మరికొన్నిటిని నిషేధించింది. గత వారం ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లపై పూర్తి నిషేధాన్ని ప్రకటించిన తర్వాత నేపాల్ అంతటా నిరసనలు వెల్లువెత్తాయి. ఓలి ప్రభుత్వం సోషల్ మీడియాకు వ్యతిరేకం కాదని, కంపెనీలు అధికారులతో నమోదు చేసుకోవాలని కోరుతుందని పట్టుబడుతోంది. అయితే, సోషల్ మీడియాను నిషేధించడం అక్కడి జెన్ జీలకు నచ్చలేదు. దీంతో యువత రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టింది.
Nepal Protest | పార్లమెంట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు..
యాప్స్‌ను బ్యాన్ చేయటంతో పాటు దేశంలో అవినీతి పెరిగిపోయిందంటూ యువకులు నిరసనలకు దిగారు. వందలాది మంది యువతీ, యువకులు ఖాట్మాండు వీధుల్లోకి వచ్చి నిరసనలు మొదలుపెట్టారు. అక్కడి నుంచి పార్లమెంట్ భవనాన్ని చుట్టుముట్టారు. పార్లమెంట్ మెయిన్ గేట్ బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి, ప్రవేశ ద్వారానికి నిప్పుపెట్టారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. ఈ కాల్పుల్లో 14 మంది చనిపోగా.. దాదాపు 100 మంది దాకా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ముగ్గురు జర్నలిస్టులు కూడా ఉన్నట్లు సమాచారం.
“ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇతర సోషల్ మీడియా సైట్లపై నిషేధానికి వ్యతిరేకంగా ప్రజలు భారీ నిరసన చేపట్టడంతో ఖాట్మండులో నిరసన హింసాత్మకంగా మారడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు, దీని ఫలితంగా పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు జరిగాయి” అని నేపాల్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
Nepal Protest | కర్ఫ్యూ విధింపు
యువత నిరసనలు తీవ్ర ఉద్రిక్తలకు దారి తీసిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండేలా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. బనేశ్వోర్, లాయిన్ చౌర్లతోపాటు పలు సున్నిత ప్రదేశాల్లో కర్ఫ్యూ విధించింది. కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు జారీ చేసింది.