అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bihar elections | బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly elections) ముందర ఓటర్లపై వరాల జల్లు కురుస్తోంది. ఓట్ల వేటలో పాట్లు పడుతున్న పార్టీలు.. ప్రజలను మచ్చిక చేసుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. కూటమి కట్టిన ప్రధాన రాజకీయ పక్షాలు అధికారం కోసం తహతహలాడుతున్నాయి. ప్రజా క్షేత్రంలో విజయమే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, 14వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.
బీహార్‌లో మరోసారి పాగా వేయాలని బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ (ఆర్వీ)తో కూడిన ఎన్డీయే కూటమి (NDA alliance) ఉవ్విళ్లూరుతోంది. అధికారాన్ని నిలుపుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తోంది. మరోవైపు, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహాఘట్ బంధన్ కూటమి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గత కొన్నేళ్లుగా ముఖ్యమంత్రి పీఠంపై పాగా వేసిన నితీశ్ కుమార్‌ను ఈసారి ఎలాగైనా గద్దె దించాలన్న లక్ష్యంతో శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓటర్లపై సరికొత్త హామీలను గుమ్మరిస్తోంది. అటు మార్పు పేరుతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జన సూరజ్ పార్టీ కూడా వరాల మూటలతో ఓటర్లను ఆకర్షించేందుకు యత్నిస్తోంది.
Bihar elections | అమలు సాధ్యం కానీ హామీలు..
బీహార్‌లో మొత్తం 243 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 122 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. అయితే, బీహార్ రాష్ట్రంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటాయి. ఇక్కడ ప్రాంతీయ పార్టీలదే ఆధిపత్యం కొనసాగుతుండగా, జాతీయ పార్టీల ప్రభావం పరిమితమే. ఈ నేపథ్యంలోనే జేడీయూ, ఆర్జేడీ (JDU and RJD) స్థానికంగా బలంగా ఉన్నాయి. కుల రాజకీయాలు (caste politics) కీలకపాత్ర పోషించే ఈ రాష్ట్రంలో కొన్ని సామాజిక వర్గాల చేతుల్లోనే నిర్ణయాధికారం ఉంది.
ఆయా వర్గాలతో పాటు ఓటర్లందరినీ ఆకర్షించేందుకు రాజకీయ పక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ హామీలలో కొన్ని ఆర్థికంగా వివేకవంతమైనవి కాకపోయినా, ఓటర్లను ఆకర్షించడానికి వాగ్దానాలు చేస్తున్నారు. మరికొన్ని అమలు సాధ్యం కానీ హామీలను సైతం ప్రకటిస్తున్నారు. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం (government job), ప్రైవేట్ బడుల్లోనూ రిజర్వేషన్లు వంటి హామీలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
Bihar elections | మహాఘట్ బంధన్ కూటమి వాగ్ధానాలివే..
అధికారం కైవసం చేసుకునేందుకు మహాఘట్ బంధన్ కూటమి (Mahaghat Bandhan alliance) అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. మరోవైపు, ఆర్జేడీ, కాంగ్రెస్ (RJD and Congress) కూటమి ప్రకటించిన వాగ్దానాల్లో ప్రధానమైంది ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఓట్ల వర్షం కురిపిస్తుందని మహాఘట్ బంధన్ కూటమి బలంగా విశ్వసిస్తోంది. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం హామీ గేమ్ చేంజర్‌గా మారుతుందని రాజకీయ పక్షాలు అంచనా వేస్తున్నాయి.
ఇక, జీవిక కార్మికులకు నెలకు రూ. 30,000 చెల్లించే శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఆర్జేడీ కూటమి ప్రకటించింది. ‘మై బహిన్ మాన్ యోజన’ (Mai Bahin Maan Yojana) కింద మహిళలకు నెలకు రూ. 2,500 చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని తెలిపింది. అలాగే, ప్రస్తుత ఉన్న 50 శాతం రిజర్వేషన్లను ఎత్తివేస్తామని, అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలలో ప్రవేశాలలో రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించింది. తెలంగాణలో రిజర్వేషన్ల పెంపును ఇప్పటికే న్యాయస్థానాలు కొట్టివేసిన తరుణంలో.. బీహార్‌లో ఎలా అమలు చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
Bihar elections | ఎన్డీయే హామీలు..
బీహార్‌లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఎన్డీయే కూటమి సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నికలకు ముందే నితీశ్ ప్రభుత్వం (Nitish government) అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించింది. వేతనాల పెంపు, మహిళలకు ఆర్థిక సాయం పెంపు వంటివి అమలు చేసింది. ముఖ్య మంత్రి మహిళా రోజ్గార్ యోజన కింద వ్యాపారాలు ప్రారంభించడానికి రాష్ట్రంలోని ప్రతి మహిళలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించింది.
వ్యవసాయం (agriculture), చేతిపనులు (handicrafts), టైలరింగ్ మొదలైన వాటికి రూ. 2 లక్షల వరకు అదనంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కొద్ది రోజుల ముందర మరో కీలక పథకాన్ని ప్రారంభించింది. ప్రతి ఇంటికి 125 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకానికి ఆగస్టు నెలలో శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి నిశ్చయ స్వయం సహాయత భట్ట యోజన కింద నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు (unemployed graduates) రెండేళ్ల వరకు నెలకు రూ. 1,000 భృతి ఇస్తామని ప్రకటించింది.
Bihar elections | జన్ సూరజ్ వాగ్ధానాలివే..
ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ స్థాపించిన జన సూరజ్ పార్టీ (Jan Suraj Party) కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగింది. అయితే, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తాను పోటీకి చేయడం లేదని ప్రకటించిన పీకే కూడా ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. ప్రాథమిక అవసరాల కోసం పురుషులు, మహిళలు, వితంతువులు, ప్రత్యేక సామర్థ్యం ఉన్న వ్యక్తులతో సహా 60 ఏళ్లు పైబడిన వారికి నెలకు రూ.2 వేల పింఛన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వలస వెళ్లిన వారిని తిరిగి రప్పించడం కోసం ఉపశమనం, పునరావాసం, ఉపాధి కోసం కొత్త విభాగాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపడే వరకు పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపించడంతో పాటు వారి ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. స్వావలంబన కలిగిన పౌరులకు 10-12 శాతానికి బదులుగా 4 శాతం వడ్డీకి రుణాలు అందిస్తామని ప్రకటించారు.
