అక్షరటుడే, ఇందూరు : Bathukamma | బతుకమ్మ వేడుకలను (Bathukamma Celebrations) మహిళలు ఎంతో సంబరంగా జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఉత్సాహంగా ఆడి పాడతారు. ఆదివారం నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానుంది.
పండుగ సందర్భంగా ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం చీరలను పంపిణీ (Sarees Distribution) చేయనుంది. ఇందిరా మహిళా శక్తి పథకం (Indira Mahila Shakti scheme) ద్వారా “అక్కాచెల్లెళ్లకు.. మీ రేవంతన్న కానుక” పేరిట చేనేత చీరల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. అయితే స్వయం సహాయక సంఘాల సభ్యులకు మాత్రమే చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో మిగతా వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ మహిళలకు (Telangana Womens) బతుకమ్మ అంటే అతి పెద్ద పండుగ. తొమ్మిది రోజులపాటు ఊరూవాడ సందడి నెలకొంటుంది. దసరా సెలవులు కావడంతో మహిళలు పిల్లలు తల్లిగారింటికి చేరుకుంటారు. పండుగ విశిష్టతను ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం మహిళలకు కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేసింది. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది బతుకమ్మ చీరలను పంపిణీ చేయలేదు. ఈ సారి మాత్రం ఒక్కో మహిళకు రెండు చీరలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే స్వయం సహాయక సంఘాల సభ్యులకు మాత్రమే చీరలను పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Bathukamma | స్పష్టత కరువు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 3.98 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో ఉన్నారు. ఇందులో నిజామాబాద్ జిల్లాలో (Nizamabad District) 2.19 లక్షల మంది, కామారెడ్డి జిల్లాలో 1.79 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. అయితే ప్రతి సభ్యురాలికి రెండేసి చీరలు పంపిణీ చేయనున్నారు. ఈ లెక్కన నిజామాబాద్ జిల్లాకు 4.38 లక్షల చీరలు, కామారెడ్డి జిల్లాకు (Kamareddy District) 3.58 లక్షల చీరలు అవసరం అవుతాయి.
మెప్మా ద్వారా మున్సిపాలిటీ, నగరపాలక సంస్థ పరిధిలోని సభ్యులకు, డీఆర్డీవో ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని సభ్యులకు చీరలను అందజేయనున్నారు. అయితే ఇప్పటి వరకు మాత్రం సంఘాల సభ్యులకు చీరల పంపిణీపై ఎటువంటి సమాచారం అందలేదు. సోమవారం నుంచి పంపిణీ చేస్తారా.. దసరా వరకు అందజేస్తారా అనేది స్పష్టత లేదు.
Bathukamma | సామాన్యులకు లేనట్టే..
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బతుకమ్మ చీరల (Bathukamma Sarees) పంపిణీ కొనసాగుతోంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు చీరలను పంపిణీ చేశారు. కానీ ఈ ఏడాది స్వయం సహాయక సంఘాల సభ్యులకు మాత్రమే అందజేయనున్నారు. దీంతో సాధారణ మహిళల్లో కాస్త అసంతృప్తి నెలకొంది.
సంఘాల్లో సభ్యులుగా లేని ఎందరో పేద మహిళలు ఉన్నారని, కనీసం వారికైనా అందజేస్తే బాగుండని మహిళలు వాపోతున్నారు. గతంలోనూ చాలా వరకు రేషన్ కార్డు (ration Card) ఉన్న మహిళలకు చీరలు అందలేదు. కొంతవరకు పంపిణీ చేసి కోటా పూర్తయిందంటూ కేంద్రాలను మూసివేశారు. అయితే గతంలో చీరల క్వాలిటీ బాగా లేదనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం క్వాలిటీ విషయంలో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. అయితే చీరలను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారనే విషయమై క్లారిటీ లేదు.