Bathukamma Festival
Bathukamma Festival | రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు.. ఎక్కడో తెలుసా?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bathukamma Festival | తెలంగాణ(Telangana) ఆడపడచులు సంబరంగా చేసుకునే బతుకమ్మ పండుగు ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడటానికి మహిళలు సిద్ధం అయ్యారు.

రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు(Bathukamma Celebrations) ఘనంగా జరుగుతాయి. రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించడానికి షెడ్యూల్​ విడుదల చేసింది.

Bathukamma Festival | తొలిరోజు వరంగల్​లో..

బతుకమ్మ వేడుకలు ఆదివారం నుంచి మొదలు కానుండగా.. ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలను ప్రభుత్వం వరంగల్​లోని వేయి స్తంభాల గుడి(Warangal Thousand Pillar Temple) ఆవరణలో సాయంత్రం నిర్వహించనుంది. అదే రోజు ఉదయం హైదరాబాద్​ నగర శివారులో సైతం బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నెల 22న హైదరాబాద్​లోని శిల్పారామం, మహబూబ్​నగర్​లోని పిల్లలమర్రి వద్ద, 23న నల్గొండలోని బుద్ధవనం, నాగర్జున సాగర్​ వద్ద అధికారిక వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

భూపాలపల్లి జిల్లా(Bhupalapally District)లోని కాళేశ్వరం ఆలయం, కరీంనగర్​ సిటీ సెంటర్​ వద్ద ఈ నెల 24 బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. 25న భద్రాచలం ఆలయం, జోగులాంబ అలంపూర్​, 26న నిజామాబాద్​ జిల్లాలోని అలీ సాగర్​, ఆదిలాబాద్, మెదక్​లో బతుకమ్మ ఆడుతారు. అదేరోజు ఉదయం హైదరాబాద్​లోని నెక్లెస్​రోడ్డులో సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు.

Bathukamma Festival | బైక్​ ర్యాలీ.. కార్నివాల్

ఈ నెల 25 నుంచి 29 వరకు హైదరాబాద్​లోని ఆర్ట్​ గ్యాలరీ(Hyderabad Art Gallery)లో బతుకమ్మ కళా శిబిరం నిర్వహించనున్నారు. 27న నెక్లెస్​ రోడ్డు, ట్యాంక్​బండ్​లో మహిళల బైక్​ ర్యాలీ ఉంటుంది. ఐటీ కారిడార్​లో బతుకమ్మ కార్నివాల్​ నిర్వహిస్తారు. 28న ఎల్బీ స్టేడియంలో గిన్నిస్​ రికార్డు లక్ష్యంగా 50 అడుగుల బతుకమ్మను పేర్చి పది వేల మంది మహిళలతో వేడుకలు జరపడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 29న పీపుల్స్​ ప్లాజాలో ఉత్తమ బతుకమ్మ పోటీలు, 30న ట్యాంక్​బండ్​ వద్ద పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు.