HomeUncategorizedBasavatarakam Hospital | అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ చేసిన బాలకృష్ణ

Basavatarakam Hospital | అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ చేసిన బాలకృష్ణ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Basavatarakam Hospital | బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Bala Krishna)  సామాజిక సేవ‌లో మ‌రో అడుగు ముందుకు వేశారు. ఏపీ రాజధాని అమరావతిలో అత్యాధునిక క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ క్ర‌మంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం (Basavatarakam Cancer Hospital Construction) కోసం.. నందమూరి బాలకృష్ణ భూమి పూజ చేశారు. కార్యక్రమంలో బాల‌య్య‌తో పాటు నారా బ్రహ్మణి, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను అమరావతిలోని (Amaravati) తుళ్లూరు మండలం పరిధిలో, నేలపాడు నుంచి అనంతవరం వెళ్లే ఈ-7 రహదారి సమీపంలో నిర్మించనున్నారు.

Basavatarakam Hospital | సామాజిక సేవ‌ల‌లో…

మొత్తం 21 ఎకరాల విస్తీర్ణంలో ఆస్పత్రి ఏర్పాటవుతోంది. మూడు దశల్లో ఈ ఆస్పత్రి నిర్మాణం జరగనుండగా, మొదటి దశలో 500 పడకల సామర్థ్యంతో విస్తృత శ్రేణి క్యాన్సర్ (ఆంకాలజీ) సేవలు అందించనున్నారు. రూ. 750 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. శస్త్రచికిత్సలు, రేడియేషన్, రోగ నిర్ధారణ, పునరావాస సేవలు వంటి విభాగాల్లో అత్యుత్తమ చికిత్సలు అందించేందుకు సన్నద్ధమవుతున్నారు. 2028 నాటికి మొదటి దశ పూర్తయ్యేలా లక్ష్యంగా పెట్టుకున్నారు.

రెండో దశలో పడకల సంఖ్యను వెయ్యికి పెంచేందుకు ప్రణాళికలు రూపొందించారు. అలాగే, ప్రత్యేక వైద్య విభాగాలు, క్యాన్సర్​పై పరిశోధనల కోసం రీసెర్చ్ సెంటర్ స్థాపన కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా జరుగుతుంది. ఈ హాస్పిటల్​ రాష్ట్ర ప్రజలకే కాకుండా, దేశవ్యాప్తంగా క్యాన్సర్ బాధితులకు మెరుగైన వైద్యం అందించే కేంద్రంగా మారనుంది. 25 ఏళ్ల విశ్వాసాన్ని కలిగిన బసవ తారకం ట్రస్ట్.. అమరావతిలో అడుగులు వేసి సామాజిక సేవకు మరింత నిబద్ధత చూప‌నుంది. ఈ ఆస్పత్రి ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలకు అధునాతన చికిత్స అందించడమే లక్ష్యంగా ట్రస్ట్ వెల్లడించింది. ఈ ఆసుపత్రి నిర్మాణం అమరావతిలో వైద్య సేవల విస్తరణకు కీలక మైలురాయిగా భావిస్తున్నారు. రాజధాని అమరావతిలో నూతన రీసెర్చ్ సెంటర్​తో పాటు అధునాతన క్యాన్సర్ హాస్పిటల్ ప్రాజెక్ట్ నిర్మించేందుకు సాయ‌ప‌డిన దాతలు, భాగస్వాములు, శ్రేయోభిలాషులకు బసవతారకం ట్రస్ట్ (Basavatarakam Trust) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ‌జేసింది.