అక్షరటుడే, బాన్సువాడ: Banswada Municipality Elections | గ్రామపంచాయతీ స్థాయి నుంచి మున్సిపాలిటీగా ఎదిగిన బాన్సువాడ పట్టణంలో (Banswada town) నిర్వహించిన రెండో మున్సిపల్ ఎన్నికలు రాజకీయంగా కీలక మలుపుగా నిలిచాయి. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో పీఠం కైవసం చేసుకోవడం మార్పునకు సంకేతాలిచ్చింది. ఈ విజయంలో డీసీసీబీ (DCCB)మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ (Agro Industries) ఛైర్మన్ కాసుల బాలరాజ్ కీలక పాత్ర పోషించారు. వీరు మున్సిపాలిటీపై ప్రత్యేకదృష్టి పెట్టి వార్డు వారీగా వ్యూహాలు అమలు చేసి కాంగ్రెస్ అభ్యర్థులను విజయ తీరాలకు చేర్చారు.
Banswada Municipality Elections | గత ఎన్నికలు.. ప్రస్తుత ఫలితాలు
2020లో తొలిసారి నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఘన విజయం సాధించింది. మొత్తం 19 వార్డుల్లో 17 స్థానాలు గెలుచుకుని పట్టణంలో పూర్తి ఆధిపత్యం చాటుకుంది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 2 వార్డులకు మాత్రమే పరిమితమైంది. అయితే తాజా ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా మారింది. కాంగ్రెస్ పార్టీ 11 వార్డుల్లో విజయం సాధించి మున్సిపల్ పాలనను చేపట్టే స్థాయికి చేరుకుంది.
ఇతర పార్టీల ప్రభావం
ఈ ఎన్నికల్లో బీజేపీ 3 వార్డులు, బీఆర్ఎస్ 3 వార్డులు, ఎంఐఎం పార్టీ 1 వార్డు, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డు గెలుపొందారు. బీజేపీ మూడు వార్డులు గెలుచుకోవడం ద్వారా పట్టణ రాజకీయాల్లో తన ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక ఎంఐఎం పార్టీ తొలిసారి మున్సిపల్ ఎన్నికల్లో ఒక వార్డు గెలుచుకుని తన ఉనికిని చాటుకుంది.