అక్షరటుడే, వెబ్డెస్క్ : Bangladesh | బంగ్లాదేశ్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ముందు అక్కడ రాజకీయ, భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.
తాత్కాలిక ప్రభుత్వ సారథిగా నోబెల్ బహుమతి (Nobel Prize) గ్రహీత మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేశంలో నేరాల స్థాయి గణనీయంగా పెరిగిందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. హింసాత్మక సంఘటనలు రోజువారీ వ్యవహారాల్లా మారిపోయాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేరాలను అదుపు చేయాల్సిన పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Bangladesh | పెరుగుతున్న నేరస్థులు
స్థానిక మీడియా కూడా పెరుగుతున్న నేర గణాంకాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే పోలీస్ విభాగం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ, షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో కంటే ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గా ఉందని చెబుతోంది. అప్పట్లో అనేక నేరాలు రికార్డుల్లో నమోదు కాలేదని, ఇప్పుడు ప్రతి సంఘటనను డిజిటల్ ఆధారాలతో నమోదు చేస్తున్నందువల్ల నేరాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే వాదనను పోలీస్ అధికారులు వినిపిస్తున్నారు. సోషల్ మీడియా (Social Media) ఆధారంగా కేసులు నమోదయ్యే వ్యవస్థ బలపడడంతో ప్రస్తుతం నేరాల సంఖ్య పెరిగినట్టు కనిపిస్తున్నప్పటికీ, నిజమైన పరిస్థితి వేరని బంగ్లాదేశ్ (Bangladesh) మీడియా వ్యాఖ్యానిస్తోంది.
ఇటీవల మాజీ ప్రధాని షేక్ హసీనా (Former PM Sheikh Hasina) కుమారుడు కూడా దేశ శాంతి-భద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కాలిక ప్రధాన సలహాదారుగా ఉన్న యూనస్, అవామి లీగ్ నాయకులు, కార్యకర్తలను చట్టవిరుద్ధంగా నిర్బంధించి హత్యలు జరిగినట్లుగా ఆయన ఆరోపించారు. ఇదే సమయంలో రాజకీయ పార్టీ (Political Party)ల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. వరుస ఆందోళనలు, నిరసనలు కొనసాగుతుండటం కూడా శాంతిభద్రతలను దెబ్బతీస్తున్న అంశంగా చెబుతున్నారు. ఈ అన్ని పరిణామాల సమాఖ్య ప్రభావంతో బంగ్లాదేశ్లో నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.