అక్షరటుడే, వెబ్డెస్క్: Bangladesh election : బంగ్లాదేశ్ లో సార్వత్రిక సమరానికి తెర లేవనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఎన్నికల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)ను గతేడాది గద్దె దించిన తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొలువు దీరిన సంగతి తెలిసిందే. అయితే, యూనస్ పై తీవ్ర ఒత్తిడి వస్తున్న తరుణంలో ఎన్నికల నిర్వహణకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు 2026 ఏప్రిల్ లో జరుగుతాయని శుక్రవారం ప్రకటించారు. ముఖ్యంగా గత సంవత్సరం ప్రభుత్వాన్ని కూల్చివేసిన ప్రజా తిరుగుబాటు ఫలితంగా షేక్ హసీనా దేశం విడిచి పారిపోయిన తర్వాత బంగ్లాదేశ్ లో జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కావడం గమనార్హం.
Bangladesh election : హసీనాపై తిరుగుబాటు
బంగ్లాదేశ్ లో అవామీ లీగ్ ప్రభుత్వం దశాబ్ద కాలానికిపైగా అధికారంలో ఉంది. అప్పటి ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)బంగ్లా రాజకీయాలను గుప్పిట పట్టి, దేశాన్ని అభివృద్ధి బాట పట్టించే ప్రయత్నం చేశారు. అయితే, విద్యార్థుల ముసుగులో మొదలైన ఉద్యమం రాజకీయంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగ కోటా వ్యవస్థలో సంస్కరణల డిమాండ్లతో రాజకీయ తిరుగుబాటు మరింత రాజుకుంది. అలాగే, అవినీతికి వ్యతిరేకంగా విస్తృత ఉద్యమంగా మారింది. గతేడాది ఆగస్టులో నిరసనలు వెల్లువెత్తడంతో షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రాణ భయంతో ఆమె అక్కడి నుంచి పారిపోయి భారత్ కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు.
Bangladesh election : ఒత్తిడికి తలొగ్గి..
హసీనా గద్దె దిగడంతో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, ఆయన నాయకత్వంపై స్థానిక రాజకీయ పార్టీలతో పాటు ప్రజల్లోనూ అసంతృప్తి మొదలైంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాలని యూనస్ పై ఒత్తిడి పెరిగింది. మాజీ ప్రధాన మంత్రి ఖలీదా జియా (ormer Prime Minister Khaleda Zia)నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)Bangladesh Nationalist Party (BNP) డిసెంబర్ 2025 నాటికి జాతీయ ఎన్నికలు నిర్వహించాలని గత నెలలో కోరింది. అలాగే, “వివాదాస్పద సలహాదారులను” తొలగించడం ద్వారా తన మంత్రివర్గాన్ని పునర్నిర్మించాలని ముహమ్మద్ యూనస్(Muhammad Yunus) ను కోరింది. మరోవైపు, ఆర్మీతో యూనస్ కు పొసగడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన గద్దె దిగేందుకూ సిద్ధమైనట్లు వార్తలొచ్చాయి. చివరకు అన్ని వైపులా నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో ఆయన ఎన్నికల నిర్వహణకు పచ్చజెండా ఊపారు. “2026 ఏప్రిల్ మొదటి అర్ధభాగంలో ఏ రోజునైనా ఎన్నికలు జరుగుతాయని ప్రకటిస్తున్నాను” అని ముహమ్మద్ యూనస్ తెలిపారు.