అక్షరటుడే, వెబ్‌డెస్క్ : T20 World Cup | భారత్ – బంగ్లాదేశ్ మధ్య ఇటీవల నెలకొన్న రాజకీయ, క్రీడా పరిణామాలు ఇప్పుడు క్రికెట్‌ను కూడా ప్రభావితం చేస్తున్నాయి. 2026 ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (Bangladesh Cricket Board), భారత్‌లో తమ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేసింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నీలో భారత్‌లో జరగాల్సిన బంగ్లాదేశ్ మ్యాచ్‌లను ఇతర దేశాలకు మార్చాలని ఐసీసీని (ICC) అధికారికంగా కోరింది.
T20 World Cup | ఐపీఎల్ నిర్ణయం నుంచి మొదలైన వివాదం
ఈ వివాదానికి కేంద్రబిందువుగా ఐపీఎల్‌లో చోటు చేసుకున్న ముస్తాఫిజుర్ రహ్మాన్ అంశం నిలిచింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) జట్టు నుంచి ముస్తాఫిజుర్‌ను విడుదల చేయడం బంగ్లాదేశ్ క్రికెట్ వర్గాల్లో అసంతృప్తిని రేకెత్తించింది. ఈ నిర్ణయం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే అభిప్రాయం బంగ్లాదేశ్‌లో బలపడింది. ముఖ్యంగా బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడుల అంశం భారత్‌లో చర్చకు రావడంతో, దాని ప్రభావం ఐపీఎల్ జట్ల నిర్ణయాలపై పడిందన్న భావన అక్కడ వ్యాప్తి చెందింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఢాకాలో అత్యవసర సమావేశం నిర్వహించిన బీసీబీ, భారత్‌లో బంగ్లాదేశ్ జట్టు (Bangladesh Team) భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. తాజా పరిణామాలను సమీక్షించిన తర్వాత, ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు వెళ్లడం సురక్షితం కాదన్న నిర్ణయానికి వచ్చినట్లు బోర్డు వెల్లడించింది. ఈ విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వ సూచనలను కూడా పరిగణలోకి తీసుకున్నామని స్పష్టం చేసింది.
తమ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, బోర్డు ప్రతినిధుల భద్రతే ప్రథమ లక్ష్యమని బీసీబీ పేర్కొంది. అందుకే టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌లో జరగాల్సిన తమ అన్ని మ్యాచ్‌లను మరో దేశానికి మార్చాలని ఐసీసీని కోరింది. ఈ అంశంపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ మండలిపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ గ్రూప్ స్టేజ్‌లో వెస్టిండీస్, ఇంగ్లండ్, ఇటలీ, నేపాల్ జట్లతో ఆడాల్సి ఉంది. వీటిలో ఎక్కువ మ్యాచ్‌లు కోల్‌కతాలో, ఒక మ్యాచ్ ముంబైలో (Mumbai) జరగాల్సి ఉంది. అయితే బీసీబీ తాజా నిర్ణయంతో ఈ మ్యాచ్‌ల వేదికలు మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.