అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bandi Sanjay | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు (KTR) బండి సంజయ్ సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ చేశారని తాను కుటుంబంతో సహా తడి బట్టలతో ప్రమాణం చేస్తానని, ట్యాపింగ్ చేయలేదని కేటీఆర్ ప్రమాణం చేస్తారా? అని సవాల్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలని, లేకపోతే కోర్టుకు ఈడ్చుతానని కేటీఆర్ చేసిన హెచ్చరికలపై బండి సంజయ్ (Bandi Sanjay) శనివారం స్పందించారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలని సూచించారు.
Bandi Sanjay | వేల ఫోన్లు ట్యాప్ అయ్యాయి..
బీఆర్ఎస్ పాలనలో వేలాది ఫోన్లను దొంగచాటుగా విన్నారని సంజయ్ ఆరోపించారు. హైకోర్టు జడ్జీలు, సినీ నటులు, వ్యాపారులతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల (BRS MLAs) ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని చెప్పారు. మావోయిస్టు సానుభూతిపరులమని పేర్కొంటూ తమ ఫోన్లను ట్యాపింగ్ చేశారన్నారు. మమ్మల్ని మావోయిస్టుల సానుభూతిపరులని కేంద్రానికి నివేదిక పంపించి, ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) చేయించారన్నారు.
మావో సానుభూతిపరులుగా పేర్కొన్న జాబితాలో తన పేరుతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఉందన్నారు. అయినా రేవంత్‌రెడ్డి (Reavanth Reddy) ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ (KCR) పాలనలో తమ బంధువులను ఎస్ఐబీలో చేర్చి, ఇష్టమొచ్చినట్లు చేశారన్నారు. ప్రభాకరరావు ఎవరని కేంద్రం అడిగితే.. సమాధానం కూడా చెప్పలేదన్నారు.
Bandi Sanjay | వాళ్లనెందుకు పిలవట్లేదు..
ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ చేస్తున్న దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని సంజయ్ తెలిపారు. సిట్ అధికార పరిధి చాలా తక్కువని చెప్పారు. అధికారులపై నమ్మకమున్నా.. ప్రభుత్వంపైనే నమ్మకం లేదన్నారు. ఎందుకంటే చాలా విచారణలు జరిపించారని, ఎందులోనూ ఏ ఒక్కరినీ అరెస్టు చేయలేదని గుర్తు చేశారు.
కాళేశ్వరం కమిషన్ దర్యాప్తు (Kaleshwaram Commission investigation) సందర్భంగా కేసీఆర్‌ను విచారణకు పిలిచారన్న బండి సంజయ్.. మరీ ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping case) కేసీఆర్, కేటీఆర్‌ను విచారణకు ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు. కేసును సత్వరమే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
Bandi Sanjay | కేటీఆర్ కు తెలుసా?
తనకు ఇంటెలిజెన్స్‌పై అవగాహన లేదన్న కేటీఆర్ వ్యాఖ్యలను సంజయ్ తిప్పికొట్టారు. నీలాగా కొంపలు ముంచే తెలివి తనకు లేదని ఎద్దేవా చేశారు. భార్యాభర్తల ఫోన్ల విన్న మూర్ఖుడికి ఎస్ఐబీ ఎందుకోసం పని చేస్తుందో తెలియదా? అని ప్రశ్నించారు.
మావోల కోసం పని చేయాల్సిన పోలీసులను వాడుకుని ఫోన్ ట్యాపింగ్ చేయించారన్నారు. మీ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏం చేసింది. భార్యభర్తల ఫోన్లు విన్నారు, వ్యాపారుల ఫోన్లు విని డబ్బులు వసూలు చేశారు.. సినీ నటుల (film actors) ఫోన్లు బ్లాక్‌మెయిల్ చేశారని మండిపడ్డారు. ఇంటెలిజెన్స్‌ను ఈ విధంగా ఉపయోగించుకోవాలని తమకు తెలియదని, నీకు మాత్రమే తెలుసని అన్నారు.
Bandi Sanjay | ఇతర రాష్ట్రాలకు డబ్బులు..
అప్పట్లో రాష్ట్రంలో చాలా చోట్ల పట్టుకున్న డబ్బులు ఏమయ్యాయని బండి సంజయ్ ప్రశ్నించారు. రికవరీ చేసిన పైసలు ఎటు పోయాయని నిలదీశారు. వీళ్లేం చేశారో తన దగ్గర పూర్తి సమాచారం ఉందని చెప్పారు. ఎన్నికలకు ముందు బెంగాల్‌కు పోయి మమత బెనర్జీకి (Mamata Banerjee) డబ్బులు ఇవ్వలేదా? అని నిలదీశారు. కేసీఆర్ పోతే మమత కనీసం గుర్తు కూడా పట్టలేదని, కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుడితో డబ్బు పంపించారన్నారు. బీఆర్ఎస్ పార్టీ గతంలో ముంబై ఎన్నికల కోసం డబ్బులు పంపలేదా? అని నిలదీశారు. వ్యక్తిగతంగా పోవడం సరికాదని, అందుకే తాను ఓపికతో ఉన్నానని చెప్పారు.
Bandi Sanjay | సీబీఐకి అప్పగించాలి
ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి (CBI) అప్పగించాలని సంజయ్ డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు (state president Ramchandra Rao) హైకోర్టులో కేసు వేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా నేరుగా సీబీఐ రాదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సిట్‌పై నమ్మకం లేదని, సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. జడ్జీతో పాటు ముఖ్యమంత్రిని పిలిచి విచారించే అధికారం సిట్‌కు ఉందా? అని ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయని, విచారణ త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. విద్యుత్ కొనుగోళ్లపై నివేదిక వచ్చినా.. ఇప్పటికీ చర్యలు చేపట్టలేదన్నారు. ఈ ఫార్ములా కేసులోనూ ఇప్పటికీ ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం లేదని చెప్పారు. అందుకే సీబీఐకి అప్పగించాలని కోరుతున్నామని తెలిపారు.
