అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Notam | పహాల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విమానాలపై నిషేధం విధించిన కేంద్రం.. ఆ గడువును మరోసారి పొడిగించింది. పాకిస్తాన్ విమానాలు(Pakistani Flights) తన గగనతలంలోకి ప్రవేశించకుండా ఉన్న నిషేధాన్ని ఆగస్టు 23 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎయిర్‌మెన్ కు కొత్త నోటీసు (NOTAM) జారీ చేసినట్లు కేంద్ర పౌర విమానయాన సహాయ మంత్రి మురళీధర్ మొహొల్(Muralidhar Mohol) తెలిపారు. “పాకిస్తానీ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించకుండా పరిమితం చేసే ఎయిర్‌మెన్ (NOTAM) కు నోటీసును అధికారికంగా ఆగస్టు 23, 2025 వరకు పొడిగించారు. ఈ పొడిగింపు కొనసాగుతున్న వ్యూహాత్మక పరిశీలనలను ప్రతిబింబిస్తుంది. ప్రస్తుత భద్రతా ప్రోటోకాల్‌లకు అనుగుణంగా ఉంటుంది” అని Xలో ఒక పోస్ట్‌లో తెలిపారు.
Notam | ఏప్రిల్ నెలాఖరు నుంచి నిషేధం..
జమ్మూకాశ్మీర్‌లోని పహాల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఘోర ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం(Central Government) కీలక నిర్ణయాలు తీసుకుంది. మతం పేరిట 26 మందిని ఊచకోత కోసిన ఈ దారుణ ఘటనకు పాకిస్తాన్(Pakistan) హస్తముండడంతో ఆ దేశంపై పలు చర్యలు చేపట్టింది. పాక్‌తో పూర్తిగా దౌత్య సంబంధాలను తెంచుకుంది. పాక్ పౌరులను తక్షణమే దేశం నుంచి పంపించేసింది. అలాగే ఆ దేశానికి చెందిన విమానాలను భారత్‌లోకి రాకుండా నిషేధం విధించింది. ఈ మేరకు పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్ నిర్వహించే, యాజమాన్యంలోని లేదా లీజుకు తీసుకున్న విమానాలు, సైనిక విమానాలతో(Military Aircraft) సహా ఆపరేటర్లకు భారత గగనతలం మూసివేస్తూ ఏప్రిల్ 30న నోటమ్ జారీ చేసింది. ఆ తర్వాత కూడా ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని పొడిగిస్తూ వస్తోంది. గతంలో విధించిన గడువు జూలై 24తో ముగియనుండగా, మరోమారు పొడిగిస్తూ తాజాగా నోటమ్ జారీ చేసింది. ఈ నోటమ్ ప్రకారం.. పాకిస్తాన్-రిజిస్టర్డ్ విమానాలు, పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్, ఆపరేటర్లు నిర్వహించే విమానాలకు, సైనిక విమానాలకు భారత గగనతలంలోకి అనుమతించరు.
మరోవైపు పాకిస్తాన్ కూడా భారత విమానాలు(Indian Airlines) తమ గగనతంలోకి రాకుండా నిషేధం విధించింది. ఆ గడువును ఆగస్టు 22 వరకు పొడిగిస్తూ ఇటీవల నోటమ్ జారీ చేసింది. భారత విమానయాన సంస్థలు నిర్వహించే విమానాల కోసం తన గగనతల మూసివేతను ఆగస్టు 24 వరకు పొడిగించిందని పాకిస్తాన్ విమానాశ్రయ అథారిటీ (Pakistan Airports Authority) గత వారం ప్రకటించింది.