అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు (hyderabad police) కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో పటాకులు కాల్చడంపై నిషేధం(ban on crackers) విధించారు. ఈ మేరకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CP cv anand) ఉత్తర్వులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా సైనిక కంటోన్మెంట్ ప్రాంతాల్లో బాణాసంచా కాల్చొద్దన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పటాకులు పేలితే ప్రజలు ఉగ్రవాదుల దాడి అనుకొని భయపడే అవకాశం ఉందన్నారు. అంతేగాకుండా అపార్థాలకు కూడా దారి తీసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు పటాకులు కాల్చకుండా పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఉత్తర్వులు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అమలులో ఉంటాయన్నారు.
