Balochisthan
Balochistan | స్వతంత్ర దేశంగా బలూచ్..​అసలు బలూచిస్థాన్​కు భారత్​కు సంబంధం ఏంటి..?

అక్షరటుడే, న్యూఢిల్లీ: Balochistan | పాక్​లో 40 శాతానికిపైగా భూభాగం కలిగి వున్న బలూచిస్థాన్ (Balochistan).. స్వతంత్ర దేశంగా ప్రకటించుకుని పాకిస్తాన్​(Pakistan)కు షాకిచ్చింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నో ఏళ్లుగా ప్రత్యేక దేశం కావాలంటూ బలూచ్​ పోరాడుతూ వస్తోంది.

తాజాగా భారత్​ చేపట్టిన ఆపరేషన్​ సిందూర్​(Operation Sindoor)తో పాకిస్తాన్ వెన్ను విరిగింది. ఇదే అదునుగా బలూచిస్థాన్ తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. దీనికితోడు తమ జాతీయ పతాకం, రాజధాని, పార్లమెంటు.. ఇలా అన్ని విషయాలు ప్రకటిస్తోంది. తమ దేశ రాయబార కార్యాలయాలకు అనుమతి ఇవ్వాలంటూ భారత్​తో సహా ఇతర దేశాలకు సందేశాలను పంపేసింది. తమను స్వతంత్ర దేశంగా గుర్తించాలని భారత్​తో పాటు ఐక్యరాజ్య సమితిని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(Balochistan Liberation Army) కోరింది.

Balochistan | అసలు ఏమిటీ బలూచిస్థాన్​..?

బలూచిస్థాన్ గొప్ప చరిత్రను కలిగి ఉంది. ఇక్కడి ప్రజలు భారత్​ మూలాలు కలిగి ఉన్నారు. బలూచ్​లో హిందూ మతం మైనారిటీ మతంగా గుర్తించబడింది. మొత్తం జనాభాలో 0.4 శాతం హిందువులు ఉన్నారు. హిందువుల పవిత్ర ఆలయమైన హింగ్లాజ్(హింగుళాంబికా దేవి) మాత ఆలయం బలూచిస్థాన్‌లోనే ఉంది. అత్యంత పవిత్రమైన హిందూ ఆలయాలలో ఒకటిగా, శక్తి పీఠాల్లో ఒకటిగా పేరుగాంచింది.

Balochistan | చరిత్ర

బలూచ్​లోని బ్రాహుయ్ ప్రజలుకు, దక్షిణ భారత్​లోని ద్రావిడియన్స్​కు దగ్గరి సంబంధం ఉంది. బ్రాహుయ్ ప్రజలు మొదట హిందూమతం, బౌద్ధ మతంలో ఉండేవారు. బలూచిస్తాన్​ను హిందూ రాజవంశాలు 7వ శతాబ్దం వరకు పాలించినట్లు చరిత్ర చెబుతోంది. 7వ శతాబ్దంలో అరబ్బుల దండయాత్రతో బలూచిస్థాన్​లో ఉన్న హిందువుల మీద ఇస్లాం మత మార్పిడులు చోటుచేసుకున్నాయి.

Balochistan | బలూచ్​ అంటే ఏమిటి..?

బలూచ్ అనే పదం ఈ ప్రాంతంలో నివసించే ప్రజల్ని సూచిస్తుంది. వీరు ఇండో – ఇరాన్ మూలాలు కలిగి ఉన్న గిరిజనులుగా పేర్కొంటారు. ఇక్కడి ప్రజలు బలోచి భాషను మాట్లాడతారు. బలో అంటే బల్.. ఓచ్ అంటే(ఇరానియన్ భాష ప్రకారం) జాతి అనే అర్థం వస్తుంది. ఇస్తాన్ అంటే స్థానం.

Balochistan | బ్రిటీష్​ హయాంలో…

1839లో బ్రిటిష్ సేనలు కలత్​పై దాడి చేశాయి. బలూచిస్థాన్ ప్రాంతాన్నే ఆనాడు కలత్(Kalat) గా పిలిచేవారు. ఈ కలత్ ప్రాంతాన్ని మీర్ మెహ్రబ్ ఖాన్ అహ్మద్ జాయ్(Mir Mehrab Khan Ahmed Joy) 1817 నుంచి 1839 వరకు పాలించారు. ఆప్ఘనిస్తాన్​పై బ్రిటీషర్స్ దాడి చేసినప్పుడు కలత్ రాజు మీర్ మెహ్రబ్ ఖాన్ ఆంగ్లేయులకు సహకరించలేదు. ఈ కారణంగానే 1839లో కలత్​పై ఆంగ్లేయులు దాడి చేసి మెహ్రబ్ ఖాన్​ను హతమార్చారు.

Balochistan | జాతీయభావం…

స్థానిక గిరిజన సర్దార్ నాయకులతో  ఈ ప్రాంతాన్ని ఆంగ్లేయులు తమ అధీనంలో ఉంచుకున్నారు. ఇది బలూచ్ గిరిజన ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. దీంతో ఆంగ్లేయులపై వీరు తరచూ తిరుగుబాటు చేసేవారు. అలా 1920 నాటికి బలూచ్ జాతీయవాదానికి అంకురార్బణ ఏర్పడింది. తద్వారా ప్రజల్లో తీవ్ర స్వాంతంత్య్ర కాంక్షకు దారితీసింది.

1929లో  అంజుమన్ – ఎ-  ఇత్తెహాద్ – ఎ- బలోచిస్తాన్(Anjuman – e- Ittehad – e- Balochistan) అనే సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ బలూచ్ సంస్కృతిని కాపాడడం, కలోత్ స్వతంత్ర రాజ్యం కోసం పని చేయడం ప్రారంభించింది. వలస రాజ్యాలకు స్వాతంత్య్రం ఇచ్చే సమయంలోనే..(అంటే సువిశాల భారత దేశ విభజన సమయానికి) మీర్ అహ్మద్ యార్ ఖాన్ నాయకత్వంలో కలత్ రాజ్యం స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది.

Balochistan | మద్దతు ఇచ్చిన ఏడాది లోపే.. ఉల్లంఘన

సాక్షాత్తు పాకిస్తాన్ పితగా చెప్పుకొనే మహమ్మద్ అలీ జిన్నానే(Mohammad Ali Jinnah) ఈ డిమాండ్​కు మద్దతు ఇచ్చారు. కలత్ స్వతంత్రతను ముస్లిం లీగ్ గౌరవిస్తుందని జిన్నా ప్రకటించారు. ఆగస్టు 11, 1947న రెండు దేశాల నేతల మధ్య ఒప్పందం కుదిరింది. కానీ, పాకిస్తాన్​ ఈ ఒప్పందాన్ని తుంగలో తొక్కింది. 1948 మార్చి 27న తమ సైన్యాన్ని పంపి, కలత్​ను బలవంతంగా ఆక్రమించుకుంది. విలీన ఒప్పందంపై సంతకం చేయాలని నాటి కలత్ నేతలపై ఒత్తిడి చేసింది. అయితే, కలత్.. భారత్​లో కలిసేందుకు సిద్ధమవుతోందని, కానీ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఇది సాధ్యం కాదని నాటి భారత ప్రధాని నెహ్రూ తిరస్కరించారనే వార్తలు వెలువడ్డాయి.

దీంతో మహమ్మద్ అలీ జిన్నా ఆదేశాల మేరకు 1948 లో బలూచ్​పై పాక్​ సైనిక చర్య చేపట్టింది. మీర్ అహ్మద్ యార్ ఖాన్​ను బలవంతంగా కరాచీకి తీసుకెళ్లి పాకిస్తాన్​లో విలీనమైనట్లు సంతంకం పెట్టించింది.

Balochistan | గెరిల్లా తిరుగుబాటు..

పాక్​లో బలూచ్​ బలవంతపు విలీనాన్ని బలూచిస్తాన్​ ప్రజలు తిరస్కరించారు. 1948లో ప్రిన్స్ అబ్దుల్ కరీం(Prince Abdul Karim) నేతృత్వంలో గెరిల్లా దాడులకు దిగారు. కానీ, పాక్ సైన్యం ఈ తిరుగుబాటును అణిచి వేసింది. కరీంను అరెస్టు చేసి జైల్లో పెట్టింది.

తర్వాత బలూచ్​లో పాక్​ సైన్యం ఆకృత్యాలు పెరిగిపోవడంతో 1958-59లో నౌషేరా ఖాన్(Nowshera Khan) నాయకత్వంలో మరో తిరుగుబాటు జరిగింది. అనంతరం 1963 నుంచి 1969 వరకు బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ సదరు తిరుగుబాటుకు నాయకత్వం వహించింది.

1973 – 77లో తీవ్ర స్థాయిలో తిరుగుబాటు జరిగింది. దీనికి ఖైర్ బక్ష్ మారీ(Khair Bakhsh Mari), అతాఉల్లా మెంగల్ (Ataullah Mengal)నాయకత్వం వహించారు. ఇందుకు ప్రధాన కారణం జుల్ఫికర్ అలీ భుట్టో సర్కారు.. బలూచిస్థాన్​ ప్రభుత్వాన్ని రద్దు చేయడం. ఇరాక్ నుంచి బలూచ్ వాదులకు ఆయుధాలు అందుతున్నాయని వారిపై సైనిక దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో 80 వేల సైనికులు పాల్గొన్నారంటే బలూచ్ తిరుగుబాటు ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

ఆ తర్వాత జుల్ఫికర్ అలీ భుట్టో(Zulfikar Ali Bhutto)ను జియా ఉల్ హక్ సైనిక చర్య ద్వారా దింపేసి అధికారంలోకి వచ్చారు. ఆయన ఈ సమస్యను రాజకీయంగా పరిష్కరించడానికి సిద్ధమయ్యారు. కాగా, బలూచ్ నాయకులు అఫ్ఘాన్​కు శరణార్థులుగా వెళ్లడంతో వారి తిరుగుబాటు ముగిసింది.

Balochistan | బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ ఏర్పాటు..

2000 దశకంలో బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ ఏర్పాటైంది. ఇది సాయుధ గెరిల్లా యుద్ధ నైపుణ్యం కలిగిన సంస్థ. 1973 -77 కాలంలో బలూచ్​ తిరుగుబాట్లకు నాయకత్వం వహించిన ఖైబర్ బక్ష్ మర్రీ కుమారుడు మీర్ బలచ్ మర్రీనే ఈ బీఎల్​ఏ(BLA) ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. స్వయం పరిపాలన, ప్రత్యేక దేశం డిమాండ్ తో ఈ సంస్థ పురుడు పోసుకుంది.

జనరల్ ముషారఫ్ సైనిక చర్యలు, బలూచ్ ప్రాంతంలో పాక్​ సైనిక స్థావరాల ఏర్పాటు, బలూచ్ నేతల అదృశ్యం.. హత్యలు, పాక్ – చైనా ఆర్థిక కారిడార్ సీపెక్​లో భాగంగా గ్వాదర్ పోర్టు ఏర్పాటు, గ్యాస్, గోల్డ్ వంటి సహజ వనరుల తరలింపుపై అలుపెరుగని పోరాటం చేసింది.

పాక్ సైన్యంతోపాటు చైనా ప్రాజెక్టుల పైన కూడా బీఎల్ఏ దాడులు చేపట్టింది. ఇలా అవకాశం చిక్కినప్పుడల్లా దాడులు చేపడుతూ అంతర్జాతీయంగా చర్చ జరిగేలా, గుర్తింపు పొందేలా పోరాడింది. తాజాగా ప్రత్యేక దేశంగా బలూచిస్థాన్​ ప్రకటించుకునే స్థాయికి ఎదిగింది. 2007లో జరిగిన నాటో దాడుల్లో మీర్ బలచ్ మర్రీ మరణించాక.. ఈ సంస్థను బషీర్ జెబ్ నడిపిస్తున్నారు.