అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nalgonda | నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో పోలైన బ్యాలెట్ పత్రాలు (ballot papers) డ్రైనేజీలో బయటపడిన ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఎస్ఈసీ ఆదేశించింది.
ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే స్టేజ్–2 రిటర్నింగ్ ఆఫీసర్‌ను జిల్లా కలెక్టర్ త్రిపాఠి (District Collector Tripathi) సస్పెండ్ చేశారు. మరోవైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగానే జరిగిందని ఎస్ఈసీ కార్యదర్శి తెలిపారు. అయితే ఎన్నికల సామాగ్రిని భద్రపరిచే విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం కమిషన్ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.
Nalgonda | రిగ్గింగ్ జరిగిందా?
దీనిపై విచారణ జరిపి, బాధ్యులైన కౌంటింగ్ అధికారులు మరియు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.చిన్నకాపర్తిలో పోలైన బ్యాలెట్ పత్రాలు డ్రైనేజీలో కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి కత్తెర గుర్తుకు వేసిన బ్యాలెట్ పేపర్లు బయటపడటంతో రిగ్గింగ్ జరిగిందని బీఆర్ఎస్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై బీఆర్ఎస్ BRS అభ్యర్థి భిక్షం ఎన్నికల అధికారులు, పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.తొలి దశ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి 455 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, అనంతరం డ్రైనేజీలో బ్యాలెట్ పత్రాలు లభించడంతో వివాదం ముదిరింది.
విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy), మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి గ్రామానికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, ఫలితాలను రద్దు చేసి ఎన్నికను చెల్లదని ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశాలు జారీ చేయగా, నల్గొండ ఆర్డీవోను విచారణ అధికారిగా నియమించారు. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో చిన్నకాపర్తి ఎన్నికల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది.