అక్షరటుడే, వెబ్‌డెస్క్: Perni Nani | మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత బాలకృష్ణకు లేదని మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) అన్నారు. అసలు సైకో బాలకృష్ణనే అని మండిపడ్డారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. బయట వేదాలు ఉపనిషత్తులు మాట్లాడడం కాదని, వాటిని ఆచరించాలని హితవు పలికారు.
తప్పతాగి అసెంబ్లీకి వచ్చి, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నానడని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఎంత సంస్కారవంతంగా మాట్లాడే వారని, ఆయన కడపున పుట్టిన బాలకృష్ణ (Balakrishna) ఇంత నీచంగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. తప్పతాగి అసెంబ్లీకి వచ్చే బాలకృష్ణ లాంటి వారి కోసం బ్రీత్ అనలైజర్ పరీక్షలు పెట్టాలని కోరారు. వైఎస్ రాజశేఖరరెడ్డి భిక్షతోనే బాలకృష్ణ ఇవాళ ఈ స్థాయిలో ఉన్నారన్నారు. ఆనాడు కాల్పుల ఘటనలో వైఎస్సార్ కాపాడింది ఎవరిని? వైఎస్ సాయం చేయకుంటే బాలకృష్ణకు జీవిత ఖైదు పడేదని తెలిపారు.
Perni Nani | అపాయింట్‌మెంట్ ఇప్పించమన్నారు..
జగన్(YS Jagan) ను తిడుతున్న బాలకృష్ణ ఒకప్పుడు ఆయన అపాయింట్‌మెంట్ ఇప్పించమని వేడుకున్నది వాస్తవం కాదా? అని పేర్ని నాని ప్రశ్నించారు. అఖండ సినిమా విడుదల సమయంలో బాలకృష్ణ తనకు ఫోన్ చేసి, జగన్ అపాయింట్‌మెంట్ ఇప్పించాలని అడిగారన్నారు. వచ్చి కలవాలని చెబితే ఆయన రాలేదని చెప్పారు. జగన్ ఏరోజూ సినిమా వాళ్లను ఇబ్బంది పెట్టలేదని, వినోదం పేదలకు అందాలన్న తాపత్రాయంతోనే టికెట్ల ధరలు తగ్గించాలని సూచించారన్నారు. చిరంజీవి, ప్రభాస్, మహేశ్‌బాబు, రాజమౌలి వంటి వారు వచ్చి సినిమాల విషయంలో మాట్లాడితే టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వలేదా? అని నిలదీశారు.
Perni Nani | సినీ పరిశ్రమ కోసమే..
తెలుగు సినిమా పరిశ్రమ బాగుండాలనే ఆనాటి ముఖ్యమంత్రి జగన్ తాపత్రాయపడ్డారని పేర్ని నాని తెలిపారు. రాజకీయ కక్షసాధింపులకు ఏనాడూ పాల్పడలేదన్నారు. జగన్ అధికారంలో ఉన్న రోజుల్లో ఏనాడైనా బసవతారం ఆస్పత్రిని ఇబ్బంది పెట్టారా? అని ప్రశ్నించారు. అమరావతిలో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మించేందుకు స్థలం తీసుకున్న బాలకృష్ణ.. జగన్ తో శంకుస్థాపన చేయించాల్సి వస్తుందని నిర్మాణాన్ని ప్రారంభించలేదన్నారు. బాలకృష్ణకు చిరంజీవి, పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) అంటే ఈర్ష్య ద్వేషాలు ఉండొచ్చు. అది మీ బావ చంద్రబాబుతో చెప్పుకోవాలి తప్పితే జగన్ మీద పడి ఏడవడం ఎందుకు? అని నిలదీశారు. చిరంజీవి ఇప్పుడు రాసిన ఉత్తరం అప్పట్లో పవన్‌కల్యాణ్ వాగినప్పుడే రాసి ఉంటే ఇంకా బాగుండేదన్నారు. బాలకృష్ణ, పవన్‌కల్యాణ్ లాంటి దుర్మార్గుల నోళ్లు మూయించిన చిరంజీవిని (Chiranjeevi) అభినందిస్తున్నామన్నారు.
Perni Nani | మా జీవో తప్పయితే రద్దు చేయొచ్చుకదా?
సినిమా పరిశ్రమ బాగుండాలని తాము ఇచ్చిన జీవో తప్పయితే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికీ ఎందుకు అమలు చేస్తోందని నాని ప్రశ్నించారు. అదే జీవోను అనుసరించి సినిమా ధరలు పెంచుకోవాలని ఎందుకు కోరుకుంటున్నారన్నారు. ఎవరికి వారు బ్లాకులో అమ్ముకోవచ్చు కదా.. మీ కాళ్ల దగ్గరకు రావాలని ఎందుకు కోరుకుంటున్నారని నిలదీశారు. అప్పట్లో సినీ పెద్దలు వచ్చి ముఖ్యమంత్రిని కలిస్తే పేదవారికి సినిమా టికెట్లు అందుబాటు ధరల్లో ఉండాలని మాత్రమే జగన్ చెప్పారు. నెలకు వంద కడితే ఇంట్లో కూర్చుని అన్ని సినిమాలు చూసే పరిస్థితి వచ్చినప్పుడు మీ సినీ ఇండస్ట్రీ బాగుండాలంటే మీరు ఆలోచించండని అప్పటి ముఖ్యమంత్రి సూచించారన్నారు.
థియేటర్లు మనుగడ సాగించాలంటే ధరల విషయంలో ఆలోచించాలని, మీరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నా తనకు సంబంధం లేదని, టికెట్లు మాత్రం పేదలకు అందుబాటులో ఉంచాలని సూచించారన్నారు. ఏడాది, రెండేళ్లకో సినిమా తీస్తే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, సినీ కార్మికులు ఏమైపోతారో ఆలోచించాలని సూచించారు. విశాఖపట్నం, రాజమండ్రి, కర్నూలు, తిరుపతి ప్రాంతాల్లో స్టూడియోలు నిర్మించేందుకు స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. సినీ పరిశ్రమను వైజాగ్‌కు తరలించాలని జగన్ సూచించారన్నారు.