అక్షరటుడే, వెబ్‌డెస్క్: LVM3 -M5 rocket | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక బాహుబలి రాకెట్ ప్రయోగం సక్సెస్ అయ్యింది. LVM3 -M5 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఆదివారం సాయంత్రం 5:26 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి రాకెట్‌ను ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా సీఎంఎస్-03 (CMS-3) అనే ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపింది. 16.9 నిమిషాల్లో ఆర్బిట్‌లోకి ఉపగ్రహం దూసుకెళ్లింది.
సీఎంఎస్-03 (CMS-03) శాటిలైట్ బరువు 4,410 కిలోలు ఉంటుంది. ఈ ఉపగ్రహాన్ని సైనికుల అవసరాల కోసం పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేశారు. అలాగే దేశానికి కీలకమైన కమ్యూనికేషన్ సేవలను మెరుగుపరచనుంది. అంతేకాకుండా సముద్ర వాతావరణ పరిస్థితులు, రక్షణ సంబంధిత కమ్యూనికేషన్ అవసరాలను తీర్చనుంది. ఇస్రో ఛైర్మన్ ఎస్.నారాయణన్ స్వయంగా షార్ కేంద్రంలో ప్రయోగాన్ని పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాహుబలి రాకెట్ ప్రయోగం సక్సెస్ అయ్యిందని ప్రకటించారు. ఈ ప్రయోగంతో భారత్ మరో ఘనత సాధించిందని చెప్పారు. ప్రాజెక్టు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన వారందరికీ అభినందనలు తెలిపారు.
