అక్షరటుడే, కామారెడ్డి: MLA KVR | వరద సమయంలో అధికారులతో పాటు తాను కూడా క్షేత్రస్థాయిలోనే ఉన్నానని.. పనిచేసే వారి పట్ల దుష్ప్రచారం చేయడం తగదని కామారెడ్డి ఎమ్మెల్యే (Kamareddy MLA) కాటిపల్లి వెంకట రమణారెడ్డి (MLA Venkata Ramana reddy) స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. కామారెడ్డిలో ఇంత భారీ వర్షం పడుతుందని, ఫలితంగా వరదలు వస్తాయని ఎవరు ఊహించలేదన్నారు. ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమని తెలిపారు. పండుగ రోజు ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండడంతో ప్రాణనష్టం జరగలేదన్నారు.
30 మీటర్లు ఉన్న వాగు ప్రవాహం 300 మీటర్లు పారిందని, ఒక చెరువు కెపాసిటీ నాలుగు చెరువులను నింపేంత ఓవర్‌ఫ్లో అయిందన్నారు. పట్టణంలో కలెక్టరేట్ (Kamareddy Collectorate) తప్ప అన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు వచ్చాయని, జీఆర్ కాలనీలో (GR Colony) మొదటి ఫ్లోర్ నిండిపోయిందని, హౌసింగ్ బోర్డులో 8 ఫీట్లు, కౌండిన్య కాలనీలో 4 ఫీట్ల ఎత్తులో నీళ్లు పారాయని తెలిపారు.
అధికారులు పని చేయలేదని అనడం అవాస్తమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి అధికార యంత్రాంగం మొత్తం వరద ప్రాంతాల్లోనే ఉందని స్పష్టం చేశారు. ఇరిగేషన్ అధికారులు (Irrigation Department) చెరువుల వద్ద, పంచాయతీ, ఆర్ అండ్‌బీ అధికారులు రోడ్లపై, మున్సిపల్ అధికారులు (kamareddy Municipality) పారిశుధ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. కలెక్టర్, ఎస్పీ, కామారెడ్డి అదనపు ఏఎస్పీ కూడా వరదల్లో తిరిగారన్నారు.
వరదలతో కామారెడ్డి నియోజకవర్గంలో తీవ్రంగా నష్టం వాటిల్లిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆర్అండ్బీ 14 పనులకు టెంపరరీగా రూ.1.79 కోట్లు, శాశ్వత పనులకు రూ.12 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖకు రూ. కోటి తాత్కాలిక పనులకు అవసరమని.. శాశ్వత పనులకు రూ.5 కోట్లు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఇరిగేషన్ శాఖకు రూ. కోటి తాత్కాలిక పనులకు.. రూ.5 కోట్లు శాశ్వత పనులకు కావాలన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీకి రూ.30 కోట్లు నిధులు అవసరమన్నారు.
నియోజకవర్గంలో 13,662 ఎకరాల్లో 8,771 మంది రైతులకు వరిపంట, 26,676 ఎకరాల్లో 18,92 మంది రైతులకు మొక్కజొన్న పంట, 577 ఎకరాల్లో 441 మంది రైతులకు చెందిన పత్తి పంట నాశనమైందన్నారు. అలాగే 126 ఎకరాల్లో 106 మంది రైతులకు చెందిన సోయా పంట, 23 ఎకరాల్లో 28 మంది రైతులకు చెందిన చెరుకు పంట కొట్టుకుపోయిందన్నారు.
17 ఎకరాల్లో 16 మంది రైతులు మినుము, 13 ఎకరాల్లో 9 మంది రైతులు పెసర పంట నష్టపోయారని తెలిపారు. నియోజకవర్గం మొత్తంలో 17,104 ఎకరాల్లో 11,843 మంది రైతులు పంట నష్ట పోయారన్నారు. విద్యుత్ శాఖకు 33/11 కేవీ 15 స్తంభాలు, 11 కేవీ 157 స్తంభాలు, ఎల్టీ లైన్స్ 149 స్తంభాలు, 62 ట్రాన్స్ఫార్మర్లకు నష్టం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వీటికి సుమారుగా రూ.62 లక్షలు అవసరమన్నారు.
MLA KVR | ప్రజల ప్రాణాలను రక్షించేందుకే.. కల్వర్టు పడగొట్టాం..
భారీ వర్షం కురిసిన రోజురాత్రి జీఆర్ కాలనీ వద్ద 8 ఫీట్ల ఎత్తున డివైడర్ పైనుంచి వరద ప్రవాహం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వాగు ప్రవాహంతోనే డివైడర్లు, లైటింగ్ కూలిపోయాయని అంతా అనుకున్నారని.. కానీ తానే అధికారులతో మాట్లాడి వాటిని కూల్చేయించానని స్పష్టం చేశారు. డివైడర్లు కూల్చేయడం వల్ల రైల్వే ట్రాక్ దెబ్బతింటుందని నాకు తెలుసని.. కానీ కూల్చేయకపోతే జీఆర్ కాలనీ మొత్తం మునిగిపోయేదన్నారు. ప్రజల ప్రాణాలు తనకు ముఖ్యమని.. ఇంకేదీ ముఖ్యం కాదని ఆయన వెల్లడించారు.
ఎన్డీఆర్ఎఫ్ బృందం వాహనం జీఆర్ కాలనీ వద్ద బోల్తా పడిందని, ఈ విషయం ఎవరికైనా తెలుసా అని ప్రశ్నించారు. రాత్రి 11 గంటల వరకు వాటర్ ఫ్లో తగ్గి ఫస్ట్ ఫ్లోర్లో చిక్కుకున్న వాళ్లు బయటకు వచ్చారన్నారు. ఆ తర్వాతే చిన్నమల్లారెడ్డి చెరువులో చిక్కుకున్న ముగ్గురు, పాల్వంచ వాగులో చిక్కుకున్న ఇద్దరిని కాపాడాలని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించామన్నారు.
MLA KVR | నేను ఇంట్లో కూర్చోలేదు..
ఇంట్లో కూర్చుని టీవీలు చూస్తూ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు కొందరు మాట్లాడారని వ్యాఖ్యానించారు. తాను ఇంట్లో కూర్చోలేదని, నియోజకవర్గం మొత్తం తిరిగానని ఎమ్మెల్యే కేవీఆర్ తెలిపారు. అధికారులతో మాట్లాడుతూనే ఉన్నానని, ఆ రాత్రి తిరిగి మళ్లీ జీఆర్ కాలనీకి వచ్చినట్లు చెప్పారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో బీబీపేటలో గేదెను తీసుకురావడానికి వెళ్లిన పెద్దాయన మరణించాడు తప్ప ఎక్కడా వరదల వల్ల ప్రాణనష్టం జరగలేదన్నారు.
MLA KVR | నన్ను తిట్టినా పర్వాలేదు..
తనను తిట్టినా పర్వాలేదని, ప్రజలకు ఆ హక్కు ఉందని, అధికారులు పని చేయలేదు అని చెప్పడం సరికాదన్నారు. ‘ప్రజలను సూటిగా అడుగుతున్నా.. వాగు ఉధృతి పెరిగి ప్రవాహం ఒక ఫీట్ నుంచి పెరుగుతున్నప్పుడు ప్రజలు బయటకు రావాలా వద్దా..? ఆ మాత్రం ప్రజలకు తెలియదా..? అని ప్రశ్నించారు. వరద వచ్చిన రోజు రాత్రి ఒక వ్యక్తిని బయటకు తీసుకు వస్తామంటే ఇక్కడే ఉంటానని చెప్తే వదిలేశామన్నారు.
వాటర్ ట్యాంక్‌పై ఎక్కిన వ్యక్తులు మాకు భోజనం తీసుకురాలేదు అంటున్నారని, భోజనం తెచ్చే పరిస్థితి ఉంటే ట్యాంక్‌పై ఎందుకు ఉన్నట్లో ఆలోచించాలి కదా అని ప్రశ్నించారు. పట్టణంలో పలు స్వచ్చంద సంస్థలు దాదాపు నాలుగు వేల ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారని పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితులకు నాలాలు కబ్జాలు, నిర్లక్ష్యంగా నిర్మాణాలు చేసుకోవడమే కారణమన్నారు.
రెండు నెలల కిందట వాగు మొత్తం బుష్ కటింగ్ చేసామని, విద్యానగర్, సాయిబాబా ఆలయం వద్ద పనులు చేస్తున్నామని తెలిపారు. పనులు పూర్తయ్యే సమయానికి ఈ పరిస్థితి వచ్చిందన్నారు. జాతీయ రహదారి పనులు రెండుమూడు రోజుల్లో పూర్తవుతాయన్నారు. జీఆర్ కాలనీ, కల్కినగర్, హౌసింగ్ బోర్డు మొత్తం కబ్జాకు గురయ్యాయని, రెండు నెలల్లో మొత్తం సర్వే చేస్తామని, ఎంతటి వారి ఇళ్లు ఉన్నా అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని స్పష్టం చేశారు. విపత్కర పరిస్థితుల్లో మూడు రోజులుగా తిండితిప్పలు మానుకుని ప్రజలకు సేవలందించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.