అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rahul Gandhi | వీడీ సావర్కర్, నాథూరం గాడ్సేల భావజాలం కలిగిన వ్యక్తులతో తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్న కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు పుణే కోర్టులో (Pune Court) దాఖలు చేసిన పిటిషన్‌ను గంటల వ్యవధిలోనే ఉపసంహరించుకున్నారు. లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వీడీ సావర్కర్(VD Savarkar)కు వ్యతిరేకంగా, కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై రాహుల్‌గాంధీ పరువు నష్టం కేసును ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయన తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది మిలింద్ పవార్ (Lawyer Milind Pawar) బుధవారం పుణే కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. వీడీ సావర్కర్, నాథూరం గాడ్సేల భావజాలం కలిగిన వ్యక్తులతో తన క్లయింట్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని పిటిషన్ వేశారు.
Rahul Gandhi | రాహుల్ అభ్యంతరాలతో..
అయితే ఈ పిటిషన్‌పై రాహుల్‌గాంధీ (Rahul Gandhi) తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో న్యాయవాది పవార్ వెనక్కి తగ్గారు. రాహుల్‌గాంధీ అనుమతి లేకుండా ఆ దరఖాస్తును తాను కోర్టుకు సమర్పించానని, అందులోని అంశాలపై ఆయన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారని వెల్లడించారు. దీంతో తాను దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నానని గురువారం కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో పిటిషన్ ఉపసంహరణను కోర్టు అంగీకరించిందని పవార్ తెలిపారు.
దివంగత స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్‌పై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై సావర్కర్ మేనల్లుడు సత్యకి సావర్కర్ పరువు నష్టం కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు త్వరలోనే విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో రాహుల్ తరఫు న్యాయవాది మిలింద్ పవార్ బుధవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సావర్కర్ అనుచరులు గాంధీకి ప్రాణహాని కలిగిస్తున్నారని పేర్కొన్నారు.