అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Baal Aadhaar | దేశంలోని ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు తప్పనిసరి అయింది. ఇప్పుడు చిన్నారులకు కూడా ఆధార్ అవసరం కావడంతో బాల ఆధార్ అనే ప్రత్యేక వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఐదేళ్లలోపు పిల్లల కోసం జారీ చేసే ఈ ఆధార్ కార్డుకు బ్లూ ఆధార్ (Blue Aadhaar) అనే పేరు కూడా ఉంది.
ఇందులో వారి పేరు, పుట్టిన తేదీ, ఫోటో వంటి వివరాలు ఉంటాయి. అయితే బయోమెట్రిక్స్ అవసరం ఉండదు. తల్లిదండ్రుల్లో ఒకరి మొబైల్ నంబర్ ఈ కార్డుతో లింక్ చేయాలి. అయితే, ఈ బాల ఆధార్ (Baal Aadhaar) కేవలం ఐదేళ్ల వయస్సు వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఐదేళ్లు నిండిన తర్వాత పిల్లల వేలిముద్రలు, కంటి పాప స్కానింగ్ వంటి బయోమెట్రిక్ వివరాలతో ఆధార్‌ను అప్‌డేట్ చేయాలి.
చాలా సందర్భాల్లో చిన్నారులకు కూడా ప్రభుత్వ పథకాల లాభాలు అందుకోవడానికి ఆధార్ తప్పనిసరి అవుతోంది. అందుకే తల్లిదండ్రులు బాల ఆధార్ తీసుకోవడం అవసరం. దరఖాస్తు చేసేందుకు కొన్ని ముఖ్యమైన పత్రాలు అవసరం అవుతాయి. అవేంటంటే..
- చిన్నారి జనన ధృవపత్రం(Birth Certificate) లేదా ఆసుపత్రి డిశ్చార్జ్ సర్టిఫికేట్
- తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్ కార్డు
- చిరునామా వివరాలు (ఆధార్‌తో సమానంగా ఉండాలి)
Baal Aadhaar | ఆన్‌లైన్ ప్రక్రియ ఇలా..
- ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్ (uidai.gov.in) లోకి వెళ్లాలి
- “My Aadhaar” సెక్షన్‌లోకి వెళ్లి “Book an Appointment” ఎంపిక చేసుకోవాలి
- నగరం ఎంపిక చేసిన తర్వాత మొబైల్ నంబర్ ఎంటర్ చేసి OTP ద్వారా వెరిఫై చేయాలి
- సమీప ఆధార్ కేంద్రానికి వెళ్ళేందుకు తేదీ, సమయాన్ని ఎంపిక చేసి అపాయింట్మెంట్ బుక్ చేయాలి
- అపాయింట్మెంట్ రోజున తల్లిదండ్రుల్లో ఒకరు బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయాలి
- చిన్నారి పుట్టిన తేదీ, అవసరమైన పత్రాలు, ఫోటో సమర్పించాలి
- దరఖాస్తు పూర్తయ్యాక బాల ఆధార్ పోస్టు ద్వారా ఇంటికి వస్తుంది
- దరఖాస్తు స్థితిని UIDAI వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు లేదా బాల ఆధార్ డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు
- ఆఫ్‌లైన్ ప్రక్రియ కూడా సులభంగా ఉంటుంది.
- దగ్గరలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాలి
- అప్లికేషన్ ఫారం నింపి అవసరమైన పత్రాలు జత చేయాలి
- తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్ వివరాలు, బయోమెట్రిక్ ఇవ్వాలి
- acknowledgement స్లిప్ తీసుకోవాలి, అందులోని Enrolment ID ద్వారా స్టేటస్ చెక్ చేయవచ్చు
- 60-90 రోజుల్లో బాల ఆధార్ కార్డు పోస్టు ద్వారా ఇంటికి వస్తుంది
ప్రస్తుత పరిస్థితుల్లో బాల ఆధార్ కార్డు లేకుండా పలు ప్రభుత్వ సదుపాయాలు అందుబాటులోకి రావడం లేదు. పిల్లలకు స్కూల్ అడ్మిషన్, స్కాలర్‌షిప్, ఆరోగ్య పథకాల్లోనూ ఇది అవసరం అవుతుంది. అందుకే ప్రతి తల్లి తండ్రి బాల ఆధార్‌ను వీలైనంత త్వరగా తీసుకోవడం మంచిది.