అక్షరటుడే, వెబ్‌డెస్క్: Azharuddin | కాంగ్రెస్ నాయకుడు, భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ (Azharuddin) మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ (Governor Jishnu Dev Verma) ఆయనతో ప్రమాణం చేయించారు.
అజారుద్దీన్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ గెలిచిన మాగంటి గోపినాథ్ (Maganti Gopinath) మృతితో ఉప ఎన్నికలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు. కాంగ్రెస్ మాత్రం ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. ఈ నియామకానికి గవర్నర్ ఇంకా ఆమోదం తెలుపలేదు. అయితే జూబ్లీహిల్స్‌లో (Jubilee Hills) భారీగా ముస్లిం ఓట్లు ఉండటంతో కాంగ్రెస్ తాజాగా.. మైనార్టీ కోటాలో అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చింది. దీంతో ఆయన ప్రమాణం చేశారు.
ప్రమాణ స్వీకారానికి ముందు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. మంత్రివర్గ విస్తరణ చేపట్టడంపై బీజేపీ ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.
Azharuddin | అజారుద్దీన్ నేపథ్యం
మహమ్మద్ అజారుద్దీన్ హైదరాబాద్‌లో (Hyderabad) జన్మించాడు. భారత జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా పని చేశాడు. ఇండియా తరఫున 99 టెస్ట్ మ్యాచ్‌లు, 334 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో బీసీసీఐ అతడిపై జీవిత కాల సస్పెన్షన్ విధించింది. దీంతో 2000లో అతని క్రికెట్ కెరీర్ ముగిసింది. అయితే నిషేధంపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. 2012లో జీవితకాల నిషేధాన్ని ఎత్తివేసింది. క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో (Congress party) చేరారు. 2009లో యూపీలోని మొరాదాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు. 2014లో రాజస్థాన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ అనూహ్యంగా మంత్రిగా ప్రమాణం చేశారు.

