అక్షరటుడే, కామారెడ్డి: Ayyappa Puja | కామారెడ్డి పట్టణంలో అయ్యప్ప ఆలయ 36వ మండల పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఈనెల 27వ నుంచి 31 వరకు అయ్యప్ప స్వామికి (Lord Ayyappa) తృతీయ పుష్కర మహా కుంభాభిషేక కార్యక్రమాలు జరుగనున్నాయి.
ఈ మేరకు గురువారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో (Ayyappa temple) ఆలయ కమిటీ నిర్వాహకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అయ్యప్ప ఆలయ 36వ మండల పూజ ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు వివరించారు.
Ayyappa Puja | నదీజలాలతో మహిళల శోభాయాత్ర..
ఈ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 26వ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు జిల్లా కేంద్రంలోని ధర్మశాల నుంచి మహిళలు నదీ జలాలను కలశాలతో అయ్యప్ప ఆలయం వరకు తీసుకొస్తారన్నారు. ఈనెల 27వ తేదీ నుంచి ప్రతిరోజూ ఉదయం 75 జంటలతో శత చండీ హోమం, 30వ తేదీ వరకు రోజు రాత్రి 8.30 గంటలకు హంస వాహనం, పులి వాహనం, గజవాహనం, అశ్వవాహనాలతో స్వామివారి ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందన్నారు.
Ayyappa Puja | స్వామి ఆభరణాల ఊరేగింపు..
అలాగే 30వ తేదీన ఉదయం అయ్యప్ప ఆలయం నుంచి స్వామివారి ఆభరణాల ఊరేగింపు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. 31వ తేదీ శతకలష కుంబాభిషేకాలు, సాయంత్రం స్వామి వారి ఊరేగింపు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో ఆలయ అధ్యక్షుడు నస్కంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గోనే శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ పట్నం రమేష్, అన్నదాన సేవా సంఘం అధ్యక్షుడు మానస రాజేందర్, నూకల ఉదయ్, కుంబాల రవి యాదవ్, పంపరి లక్ష్మణ్, నక్క శ్రీనివాస్ అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.