అక్షరటుడే, వెబ్డెస్క్ : DGP Office | హైదరాబాద్ (Hyderabad)లోని డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు కార్యాలయం ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు అయ్యప్ప మాల (Ayyappa Maala) వేసుకోవద్దని ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
కంచన్బాగ్ ఎస్సై (Kanchanbagh SI)కు ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేశారు. పోలీసు సిబ్బంది యూనిఫాం కాకుండా ఇతర దుస్తులు ధరించొద్దని, గడ్డం పెంచడం లాంటివి చేయొద్దని అందులో పేర్కొన్నారు. మాల వేసుకోవాలంటే సెలవు పెట్టాలని సూచించారు. దీనిపై హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందు పోలీసులకే రూల్స్ వర్తిస్తాయా అని ఆయన ప్రశ్నించారు. 40 రోజులు సెలవు ఇస్తారా అన్నారు.
DGP Office | అడ్డుకున్న పోలీసులు
అయ్యప్ప మాల విషయంలో పోలీసు ఉన్నతాధికారుల తీరును నిరసిస్తూ గురువారం ఉదయం స్వాములు, బీజేవైఎం కార్యకర్తలు (BJYM Leaders) పెద్ద ఎత్తున డీజీపీ కార్యాలయ ముట్టడికి బయలు దేరారు. కార్యాలయం (DGP Office) లోపలికి వెళ్లేందుకు స్వాములు యత్నించారు. ఈ క్రమంలో స్వాములకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కొందరు స్వాములను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా అయ్యప్ప మాలధారులు మాట్లాడుతూ.. మాల వేసుకున్న పోలీసుల యూనిఫాంపై ఆంక్షలు ఎందుకంటూ నిరసన తెలిపారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా రూల్స్ ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.