అక్షరటుడే, భీమ్గల్: Bheemgal | పట్టణంలోని చొక్కయ్యగుట్ట ప్రాంతంలో వెలసిన అయ్యప్ప స్వామి సన్నిధానంలో ఆరట్టు ఉత్సవం (Arattu festival) శనివారం కనులపండువగా జరిగింది. మండల దీక్షలు ముగిసిన తరుణంలో గురుస్వాములు పోల్కం సుదర్శన్, భూమేష్, రత్నంల ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Bheemgal | పద్దెనిమిది మెట్ల పూజ..
స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని శనివారం ఉదయం వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి రథంపై ఉంచారు. పట్టణంలోని బడా భీమ్గల్ చౌరస్తాలో ఉన్న హనుమాన్ దేవాలయం వద్ద మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్ రథయాత్రను ప్రారంభించారు. ‘స్వామియే శరణం అయ్యప్ప’ (Swamiye Sharanam Ayyappa) అనే నామస్మరణతో భీమ్గల్ వీధులు మార్మోగాయి. ముచ్కూర్ చౌరస్తా, నందిగల్లీ, అంగడి బజార్ మీదుగా ప్రధాన వీధుల గుండా సాగిన ఊరేగింపులో మాలధారులు రంగులు పూసుకుని, భజనలు చేస్తూ నృత్యం చేయడం అందరినీ ఆకట్టుకుంది.
Bheemgal | వైభవంగా జలకాలాట
ఊరేగింపు అనంతరం ఆలయ ప్రాంగణంలోని కోనేరు వద్దకు చేరుకున్న భక్తులు, దానిని పవిత్ర పంపానదిగా భావిస్తూ స్వామివారికి ఆరట్టు మహోత్సవాన్ని (Arattu Mahotsavam) నిర్వహించారు. విగ్రహాన్ని జలకాలాడించి అనంతరం అభిషేకాలు, పడిపూజలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా భక్తులకు బండి బాలకృష్ణ కుటుంబ సభ్యులు భిక్షా (అన్నదానం) కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ వేడుకల్లో పట్టణ సీఐ సత్యనారాయణ, పోలీసు సిబ్బంది, అయ్యప్ప సేవా సమితి ట్రస్ట్ సభ్యులు యాదగిరి, రాజశేఖర్, రమేష్ గురుస్వామి, సర్వ సమాజ కమిటీ అధ్యక్షుడు నీలం రవి, వివిధ పార్టీల నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముందు రోజు శుక్రవారం రాత్రి పవన్ శర్మ గురుస్వామి నేతృత్వంలో పద్దెనిమిది మెట్ల పూజను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.