అక్షరటుడే, వెబ్డెస్క్: Ayesha Meera Case Closure | ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించి అయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆధారాలు లేవని చెప్పి కోర్టు ఈ కేసును మూసి వేసింది. 18 ఏళ్లుగా సాగుతున్న ఈ కేసులో బాధితులకు న్యాయం జరగకపోవడం గమనార్హం.
కృష్ణా జిల్లా (Krishna District) ఇబ్రహీంపట్నంలోని ఉమెన్స్ హాస్టల్లో 2007 డిసెంబర్ 27న అయేషా దారుణ హత్యకు గురైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సత్యంబాబును నిందితుడిగా పోలీసులు పేర్కొనగా కోర్టు అతడికి జైలు శిక్ష విధించింది. 2017లో హైకోర్టు (High Court) అతడిని నిర్దోషిగా ప్రకటించింది. చేయని తప్పుకు అతడు 8 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు. ఈ కేసులో అసలు నిందితులను పట్టుకోవాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. సీబీఐ అధికారులు (CBI Officers) అయేషా మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు. అయితే ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించలేదని సీబీఐ పేర్కొంది. దీంతో ఈ కేసును మూసి వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.
Ayesha Meera Case Closure | నిందితుడు ఎవరు?
ఓ యువతి కలలు కల్లలు అయ్యాయి. హాస్టల్లో దారుణ హత్యకు గురైంది. అయినా పోలీసులు, సీబీఐ అధికారులు అసలు దోషిని పట్టుకోలేకపోయారు. పోలీసులు అయితే ఏ తప్పు చేయని వ్యక్తిని నిందితుడని చెప్పి అరెస్ట్ చేశారు. దీంతో అతడు 8 ఏళ్లు శిక్ష అనుభవించాడు. చేయని తప్పుకు ఓ వ్యక్తి బలికాగా.. ఈ కేసులో అసలు హంతకుడిని పట్టుకోలేకపోవడం గమనార్హం. దీంతో సుదీర్ఘ కాలంగా న్యాయపోరాటం చేస్తున్న అయేషా తల్లిదండ్రులు దానిని విరమించుకున్నారు.
Ayesha Meera Case Closure | 27న అంత్యక్రియలు
రీ పోస్టుమార్టం కోసం సేకరించిన తమ కూతురి అవశేషాలు ఇవ్వాలని అయేషా తల్లిదండ్రులు కోరారు. దీంతో కోర్టు ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వైద్య బృందం సేకరించిన అవశేషాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని పేర్కొంది. ఫిబ్రవరి 27న తెనాలి (Tenali)లో అంత్యక్రియలు నిర్వహించాలని సూచించింది. అందుకు అవసరమైన భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.