అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad Urban | ఆహార కల్తీ నివారణకు చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా మహిళా సంక్షేమ అధికారి రసూల్బీ (Womens Welfare Officer Rasool Bi) అన్నారు. జాతీయ పాల దినోత్సవం (National Milk Day) సందర్భంగా నగరంలోని గంగాస్థాన్లో గల వివేకానంద మఠంలో బుధవారం చైతన్య సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్య జీవితంలో పాల వాడకం తప్పనిసరిగా మారిపోయిందన్నారు. ఇటీవల పాల ప్యాకెట్ల కొనుగోలు గణనీయంగా పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ప్యాకెట్లు కొనుగోలు చేసే సమయంలో తయారీ తేదీ, నిల్వ తేదీ, ఎక్కడ తయారైంది తదితర వివరాలను పరిశీలించాలన్నారు. కొనుగోలు చేసే పాలలో నాణ్యత ఉండేలా చూసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలకు ఫోర్టిఫైడ్, టెట్రా పాల ప్యాకెట్లను (tetra milk packets) సరాఫరా చేస్తున్నట్లు చెప్పారు.
పుడ్ ఇన్స్పెక్టర్ సునీత (Food Inspector Sunitha) మాట్లాడుతూ.. వ్యాపారస్థులు పాలను కల్తీ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పాలను కల్తీ చేసేందుకు కొందరు యూరియా, పిండి పదార్థాలు, ఉప్పు కలపడం, పాలు ఎక్కువ కాలంపాటు నిల్వ ఉండడానికి హనికరమైన ఫార్మాలిన్ కలుపుతున్నారన్నారు. ఇలా చేయడం సరికాదన్నారు. ఆహర కల్తీ నిరోధక చట్టాల ప్రకారం చర్యలు చేపడతామని చెప్పారు.
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నవిత మాట్లాడుతూ.. పాలు, ఇతర ఆహర పదార్థాల కల్తీపై ఫిర్యాదు చేయాలనుకుంటే 72073 16531 నెంబర్కు ఫోన్ చేయాలన్నారు. సదస్సులో విజయ డైరీ మేనేజర్ రమేశ్, డిచ్పల్లి చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ జ్యోతి, ఇందూరు వినియోగదారుల సంక్షేమ సమితి ప్రధాన కార్యదర్శి సందు ప్రవీణ్, ఉపాధ్యక్షుడు వీఎన్ వర్మ, సంయుక్త కార్యదర్శులు మహాదేవుని శ్రీనివాస్, గైని రత్నాకర్, సౌత్ రాష్ట్రాల కార్యదర్శి శ్రీనివాసాచారి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కందుకూరి శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్ అధ్యక్షుడు యాటకర్ల దేవేష్ తదితరులు పాల్గొన్నారు.