అక్షరటుడే, కామారెడ్డి: Cyber Warriors | సైబర్ నేరాల నివారణకు అవగాహనే ప్రధాన ఆయుధమని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం సైబర్ క్రైమ్ నియంత్రణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా పరిధిలో విధులు నిర్వహిస్తున్న సైబర్ వారియర్స్‌కు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (Telangana Cyber Security Bureau), హైదరాబాద్ అందించిన టీ-షర్ట్స్‌ను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు వేగంగా విస్తరిస్తున్నాయని, ప్రతి పోలీస్ సిబ్బంది ఈ రంగంలో పూర్తి అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరమన్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానం నిరంతరం అభివృద్ధి చేసుకోవాలని, ప్రతి కేసును సీరియస్‌గా తీసుకుని బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి పోలీస్ స్టేషన్‌లో సైబర్ నేరాలపై నిపుణుల బృందం ప్రజలకు మార్గదర్శనం చేయాలని, ప్రజలకు తరచుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 1930 నంబర్ లేదా www.cybercrime.gov.in ద్వారా వెంటనే ఫిర్యాదు చేయాలనే విషయాన్ని ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని తెలిపారు.
సైబర్ నేరాల్లో గోల్డెన్ అవర్ ఎంతో కీలకమని, మోసానికి గురైన వెంటనే సమాచారం ఇస్తే డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. తెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పవద్దని, తెలియని లింకులు లేదా అప్లికేషన్లు మొబైల్‌లో వినియోగించవద్దని, సోషల్ మీడియా ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు (Yella Reddy DSP Srinivas Rao), సైబర్ క్రైం జిల్లా నోడల్ ఆఫీసర్ శ్రీధర్, సైబర్ వారియర్స్ సిబ్బంది పాల్గొన్నారు.