అక్షరటుడే, వెబ్డెస్క్ : CP Sajjanar | సంక్రాంతి పండుగ (Sankranti Festival) సమీపిస్తోంది. పట్టణాలు, నగరాల్లో నివాసం ఉంటున్న వారు స్వగ్రామాలకు పయనం అవుతున్నారు. అలాంటి వారికి హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు.
రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. తెల్లవారుజామున పొగమంచు (Fog) కమ్మేస్తోంది. దీంతో ఎదురుగా ఉన్న మనిషి కూడా కనిపించడం లేదు. ఈ క్రమంలో సంక్రాంతి పండుగకు ఇళ్లకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని సజ్జనార్ సూచించారు. సంక్రాంతి సంబరం విషాదం కాకూడదని ఆయన పేర్కొన్నారు. పండుగ నాడు పల్లెకు చేరాలన్న ఆత్రుత, ప్రాణాల మీదకు తేకుండా చూసుకోవాలన్నారు.
CP Sajjanar | కమ్మేసిన పొగమంచు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కమ్మేసిన దట్టమైన పొగమంచు.. మృత్యువుకు ముసుగులా మారిందన్నారు. ఎదురుగా ఏముందో కనిపించని ఈ పరిస్థితిలో డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరం అని సీపీ పేర్కొన్నారు. పొగమంచులో సొంత వాహనాల్లో ప్రయాణం చేయకపోవడం మేలని పేర్కొన్నారు. తెల్లవారుజామున, అర్ధరాత్రి వేళల్లో సాహసం చేయొద్దన్నారు. పొగమంచు పూర్తిగా తగ్గి, రోడ్డు స్పష్టంగా కనిపించిన తర్వాతే ప్రయాణాన్ని ప్రారంభించాలని కోరారు.
CP Sajjanar | జాగ్రత్తలు తప్పనిసరి
పొగమంచు ఉన్నప్పుడు వాహనం నడపాల్సి వస్తే.. ఫాగ్ లైట్లు (Fog Lights), ఇండికేటర్లు ఆన్ చేయాలని సీపీ సజ్జనార్ సూచించారు. ముందు వెళ్లే వాహనానికి తగినంత దూరం పాటించాలన్నారు. రోడ్డు ఖాళీగా ఉందని వేగంగా వెళ్లొద్దన్నారు. ఆలస్యంగానైనా సరే.. క్షేమంగా ఇంటికి చేరడమే నిజమైన పండుగ అని పేర్కొన్నారు.