అక్షరటుడే, వెబ్డెస్క్: Avinash Reddy : కడప (Kadapa) జిల్లా పులివెందులలో (Pulivendula) ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ కడప ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అవినాశ్ రెడ్డిని (MP Avinash Reddy) పోలీసులు అరెస్టు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఈ రోజు తెల్లవారుజామునే భారీ బలగాలతో పోలీసులు అవినాశ్ రెడ్డి నివాసానికి చేరుకుని, బలవంతంగా ఆయన్ను కారులోకి ఎక్కించి కడపకు తరలించారు. ఈ చర్యలపై వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు. పోలీసుల వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేయగా, స్వల్పంగా తోపులాటలు చోటుచేసుకున్నాయి. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు భారీగా మోహరించారు.
Avinash Reddy : ముందస్తు అరెస్ట్..
ఇక పులివెందుల, ఒంటిమిట్టలో జడ్పీటీసీ ZPTC ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. బ్యాలెట్ విధానంలో జరుగుతున్న ఈ ఎన్నికలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి.
పులివెందులలో..
- మొత్తం ఓటర్లు: 10,600
- పోలింగ్ కేంద్రాలు: 15
- బరిలో ఉన్న అభ్యర్థులు: 11 మంది
ఇక ప్రధాన పోటీ వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి vs టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి మధ్య ఉంది. ఈ ఎన్నికలను అధికార, ప్రతిపక్ష కూటములు చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఇక్కడ వాతావరణం చాలా వాడివేడిగా ఉంది.
ఒంటిమిట్ట(Vontimitta)లో..
- మొత్తం ఓటర్లు: 24,600
- పోలింగ్ కేంద్రాలు: 30
- బరిలో ఉన్న అభ్యర్థులు: 11 మంది
ఉప ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కినప్పటికీ, శాంతియుతంగా ఎన్నికలు పూర్తయ్యేలా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్లు అధిక సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించేందుకు తరలివస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంపై అందరి దృష్టి ఉంది. పులివెందుల, ఒంటిమిట్ట ఈ రెండు మండలాల్లో కలిపి మొత్తం 1500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలలో గెలుపు ఎవరిదా అంటూ ఆసక్తికర చర్చ నడుస్తోంది.