అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Avika Gor | పాపులర్ సీరియల్ ‘చిన్నారి పెళ్లికూతురు’తో పాన్‌ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన అవికా గోర్ తెలుగు ప్రేక్షకులకు ‘ఉయ్యాలా జంపాల’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది.
ఆ సినిమా మంచి విజయం సాధించగా, తర్వాత అవికా ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మామ’, ‘రాజుగారి గది 3’ తదితర చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే నిర్మాతగా మారి పలు చిత్రాలను నిర్మిస్తోంది. వెబ్ సిరీస్‌ల్లోనూ కనిపిస్తూ కెరీర్‌ను డైనమిక్‌గా కొనసాగిస్తోంది.
Avika Gor | ఆరేళ్ల ప్రేమకు ముగింపు..
అవికా గోర్ గత ఆరేళ్లుగా సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త మిలింద్ చాంద్వాని(Milind Chandwani)తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. 2019లో ఒక కార్యక్రమం ద్వారా కలిసిన వీరిద్దరూ స్నేహితులుగా మారి, ఆ క్రమంలోనే మెల్లగా ప్రేమలో పడ్డారు. 2020లో సోషల్ మీడియాలో తమ ప్రేమను అధికారికంగా వెల్లడించిన ఈ జంట, ఈ ఏడాది జూన్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు సెప్టెంబర్ 30న ముంబైలో జరిగిన గ్రాండ్ వేడుకలో అవికా–మిలింద్‌లు ఒక్కటయ్యారు. ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ప్రస్తుతం అవికా గోర్(Avika Gor) ‘షణ్ముఖ్’ అనే తెలుగు సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో రెండు సినిమాలు ఆమె చేతిలో ఉన్నట్లు సమాచారం. పెళ్లి తర్వాత కెరీర్‌ను ఎలా కొనసాగిస్తుందన్నది ఆసక్తికరమైన అంశం. అభిమానులు మాత్రం పెళ్లి అనంతరం కూడా ఆమెను తెరపై చూస్తామని ఆశిస్తున్నారు. ఇక ముంబై వేదికగా జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు సినీ పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖులు కూడా హాజరైనట్టు తెలుస్తుంది. మరి కొందరు సోషల్ మీడియా వేదికగా నూతన దంపతులను మనసారా ఆశీర్వదించి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.