Homeక్రీడలుIND vs Aus | మ‌ళ్లీ టాస్ ఓడిన భార‌త్.. తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది ఎవ‌రంటే..!

IND vs Aus | మ‌ళ్లీ టాస్ ఓడిన భార‌త్.. తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది ఎవ‌రంటే..!

టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు ఆస్ట్రేలియాలో జ‌రిగే ఈ వన్డే సిరీస్‌ చివరిది కానుంది. 2027 ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌ వరకు ఆడే అవకాశమున్నప్పటికీ, ఆ తర్వాత ఆసీస్‌తో మరిన్ని సిరీస్‌లు ఉండవు. అందుకే సిడ్నీలో జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా చివరి వన్డే కోసం అభిమానులు భారీగా స్టేడియంకు తరలివస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IND vs Aus | ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా రెండు ఓటములు ఎదుర్కొన్న భారత జట్టు మూడో వన్డేలో అయినా గెలిచి ఓదార్పు విజయాన్ని నమోదు చేయాలనే సంకల్పంతో బరిలోకి దిగుతోంది.

పెర్త్‌లో వర్షం ఆటకి అంతరాయం కలిగించగా, అడిలైడ్‌లో కాస్త మెరుగ్గా ఆడినా కీలక సమయాల్లో పట్టు కోల్పోయిన టీమ్‌ఇండియా (Team India) ఇప్పుడు సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎస్‌సీజీ) వేదికగా శనివారం జరిగే మూడో వన్డేలో సిరీస్‌ పరాజయాన్ని నివారించేందుకు సిద్ధమవుతోంది. ఆసీస్‌ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించడం గిల్‌ సేనకు కఠినమైన సవాలుగా మారింది. టాప్‌ ఆర్డర్‌ వైఫల్యం భారత జట్టును తీవ్రంగా వేధిస్తోంది. రెండు మ్యాచ్‌ల్లోనూ స‌రైన‌ ఆరంభం అందించలేకపోవడం జట్టు మొత్తంపై ఒత్తిడిని తెచ్చింది.

IND vs Aus | ప‌రువు ద‌క్కించుకుంటారా..

ఇక ఆసీస్‌ (Australia) మాత్రం సిరీస్‌లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ, భారత్‌ పై ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ని తొలిసారి క్లీన్‌స్వీప్‌ చేయాలనే పట్టుదలతో ఉంది. తమకు అచ్చొచ్చిన సిడ్నీ పిచ్‌పై అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా ఆడి చరిత్ర సృష్టించాలని మిచెల్‌ మార్ష్‌ సేన ఉత్సాహంగా ఉంది. భారీ అంచనాల నడుమ పర్యటనకు వెళ్లిన స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్‌ కావడం అభిమానులను నిరాశపరిచింది. మరోవైపు రోహిత్‌ అడిలైడ్‌లో కుదురుకున్నప్పటికీ, గిల్‌ (Shubhman Gill) మాత్రం తన ఫామ్‌ను అందుకోలేక‌పోతున్నాడు. రాబోయే రెండేళ్లలో ఆస్ట్రేలియాతో భారత్‌కు వన్డే సిరీస్‌లు లేని నేపథ్యంలో, ఇది కోహ్లీ–రోహిత్‌ (Rohit Sharma)లకు కంగారూల గడ్డపై చివరి అవకాశం కావడంతో ఈ మ్యాచ్‌పై ప్రత్యేక దృష్టి ఏర్ప‌డింది.

జట్టు కూర్పు విషయంలోనూ టీమ్‌ఇండియా విమర్శలు ఎదుర్కొంటోంది. నితీశ్‌ కుమార్‌ (Nitish Kumar) వంటి ఆల్‌రౌండర్‌ను సరైన విధంగా వినియోగించలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సిడ్నీ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించవచ్చన్న అంచనాల మధ్య కుల్‌దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav)ను జట్టులోకి తీసుకున్నారు. అలానే అర్ష్‌దీప్‌కి బ‌దులుగా ప్ర‌సిద్ కృష్ణ జ‌ట్టులోకి వ‌చ్చాడు. ఇక ఆస్ట్రేలియా ఒకే ఒక్క మార్పుతో బ‌రిలోకి దిగుతుంది. బార్ట్‌లెట్ స్థానంలో ఎల్లిస్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. అయితే, ఇక్కడ భారత్‌ రికార్డు అంత గొప్పగా లేదు. సిడ్నీలో ఆడిన 19 వన్డేల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. మరోవైపు ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు సిరీస్‌ను 3-0తో ముగించి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది.