అక్షరటుడే, వెబ్‌డెస్క్: T20 World Cup | టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీకి సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇప్పటికే బీసీసీఐ (BCCI) భారత జట్టును ప్రకటించగా, తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా కూడా టీ20 వరల్డ్ కప్ కోసం తమ జట్టును అధికారికంగా వెల్లడించింది.
మిచెల్ మార్ష్ (Mitchell Marsh) సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన ఆస్ట్రేలియా జట్టును ప్రకటించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఈ సందర్భంగా సెలక్టర్ల ఛైర్మన్ జార్జ్ బెయిలీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గాయాలతో ఇబ్బంది పడుతున్న ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, డేవిడ్ గ్రేడ్లు టోర్నమెంట్ సమయానికి పూర్తిగా ఫిట్ అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.
T20 World Cup | స్ట్రాంగ్ టీమ్..
వెన్నెముక గాయంతో బాధపడుతున్న కమిన్స్ (Cummins) ఇటీవల యాషెస్ సిరీస్‌లో కేవలం ఒక టెస్టు మాత్రమే ఆడాడు. ఈ నెల చివర్లో అతడికి స్కాన్ నిర్వహించనుండగా, ఆ నివేదిక ఆధారంగా తుది జట్టులో కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు బిగ్‌బాష్ లీగ్ మ్యాచ్‌లో డేవిడ్ గ్రేడ్ హామ్‌స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. హేజిల్‌వుడ్ కూడా హామ్‌స్ట్రింగ్ గాయంతో పాటు చీలమండల నొప్పి కారణంగా యాషెస్ సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే ముగ్గురూ వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే కోలుకుంటారని భావించి జట్టులో ఎంపిక చేసినట్లు జార్జ్ బెయిలీ (George Bailey) స్పష్టం చేశారు.
ఈసారి ఆస్ట్రేలియా జట్టు (Australia Team) ఎంపికను పరిశీలిస్తే, ఉపఖండ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని స్పిన్ బౌలింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. నెమ్మదైన పిచ్‌లు, టర్న్‌కు అనుకూలమైన పరిస్థితుల్లో రాణించేలా సమతూకంతో కూడిన జట్టును ఎంపిక చేశారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే టీ20 ఫార్మాట్లోకి అడుగుపెట్టిన యువ ఆటగాడు కూపర్ కానొలీకి జట్టులో చోటు దక్కడం కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది ప్రాథమిక స్క్వాడ్ మాత్రమేనని, అవసరమైతే జనవరి 31 వరకు జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉందని జార్జ్ బెయిలీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో గాయాల నుంచి పూర్తిగా కోలుకోని ప్లేయర్లను పక్కనపెట్టే అవకాశమూ ఉందని తెలుస్తోంది.
T20 World Cup | ఆస్ట్రేలియా జట్టు ఇదే..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కానెల్లీ, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మ్యాథ్యూ కుహ్నెమన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మ్యాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.