అక్షరటుడే, వెబ్‌డెస్క్: AUS vs ENG | ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (Melbourne Cricket Ground) వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో బౌలర్లు నిప్పులు చెరిగారు. శుక్రవారం ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్ట్ (Boxing Day Test)లో ఇరు జట్ల పేసర్లు ఆధిపత్యం చెలాయించడంతో తొలి రోజే ఏకంగా 20 వికెట్లు నేలకూలాయి.
టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 45.2 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బ్యాటింగ్‌లో మైఖెల్ నెసర్ (Michael Neser) 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఉస్మాన్ ఖవాజా 29, అలెక్స్ క్యారీ 20 పరుగులు చేయగా, మిగతా బ్యాట్స్‌మెన్ ఇంగ్లండ్ పేసర్ల ముందు నిలబడలేకపోయారు. ఇంగ్లండ్ బౌలింగ్ విభాగంలో జోష్ టంగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5/45తో ఐదు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను కట్టడి చేశాడు. గస్ అట్కిన్సన్ 2/20తో రెండు వికెట్లు తీయగా, కెప్టెన్ బెన్ స్టోక్స్ (Captain Ben Stokes), బ్రైడన్ కార్స్ (Brydon Carse)కు చెరో వికెట్ దక్కింది.
AUS vs ENG | బౌలర్ల ప్రతాపం..
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ కూడా ఆస్ట్రేలియా బౌలర్ల దాటికి కుప్పకూలింది. 29.5 ఓవర్లలో కేవలం 110 పరుగులకే ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ 41 పరుగులతో పోరాడగా, గస్ అట్కిన్సన్ 28, బెన్ స్టోక్స్ 16 పరుగులు మాత్రమే చేయగలిగారు. మిగతా టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. జాక్ క్రాలీ 5, బెన్ డకెట్ 2, జాకోబ్ బెతెల్ 1, జో రూట్ డకౌట్‌గా వెనుదిరిగారు. జేమీ స్మిత్ 2, విల్ జాక్స్ 5, బ్రైడన్ కార్స్ 4 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మైఖెల్ నెసర్ 4/45తో నాలుగు వికెట్లు తీయగా, స్కాట్ బోలాండ్ 3/30తో మూడు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్ 2/23తో రెండు వికెట్లు సాధించగా, కామెరూన్ గ్రీన్ ఒక వికెట్ తీశాడు.ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగియడంతో ఆస్ట్రేలియా (Australia)కు 42 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఒక ఓవర్ ఆడి వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది.
అయితే శనివారం ఉదయం ఇంగ్లండ్ బౌలర్స్ అద్భుత ప్రదర్శన కనబరచడంతో మరోసారి బ్యాటర్స్ క్యూట కట్టారు. బోలండ్(6), హెడ్ (46), వెదరాల్డ్(5), లబుషేన్ (8),ఖవాజా( 0), క్యారీ( 4) వెంట వెంటనే ఔటయ్యారు. గ్రీన్ ( 19 ) కాసేపు క్రీజులో ఉన్నా స్టోక్ అద్భుతమైన బంతికి ఔటయ్యాడు. ఆ తర్వాత నెసర్, స్టోక్స్ డకౌట్ అయ్యారు. రిచర్డ్ సన్ 7 పరుగులు చేసి ఔట్ కావడంతో ఆస్ట్రేలియా 132 పరుగులకి ఆలౌట్ అయింది. స్మిత్ (24నాటౌట్)గా ఉన్నారు.. ఆసీస్‌కి 174 పరుగుల ఆధిక్యం రాగా, ఇంగ్లండ్ గెలవాలంటే 175 పరుగులు చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0తో కైవసం చేసుకుంది. మిగిలిన రెండు టెస్టులను కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో ఆసీస్ ముందుకు సాగుతుండగా, కనీసం రెండు మ్యాచ్‌ల్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ఇంగ్లండ్ ప్రయత్నిస్తోంది.