అక్షరటుడే, వెబ్‌డెస్క్: India Champions | వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 (WCL) టోర్నీలో భాగంగా భారత ఛాంపియన్స్ జట్టు పాకిస్తాన్‌తో తప్ప ఇతర జట్లతో ఆడుతోంది. అయితే ఇండియా ఛాంపియన్స్ పరాజయాల పరంపర కొనసాగిస్తుండడం అభిమానులను ఇబ్బంది పెడుతుంది.
యువరాజ్ సింగ్ నాయకత్వంలోని జట్టు శనివారం ఆస్ట్రేలియా ఛాంపియన్స్ (Australia Champions) చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇది జట్టుకు వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా ఛాంపియన్స్ జట్టు ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 203 రన్స్ చేసింది. ఇక శిఖర్ ధావన్ (60 బంతుల్లో 91; 12 ఫోర్లు, 1 సిక్స్) చక్కని ఇన్నింగ్‌తో రాణించాడు. యూసఫ్ పఠాన్ (23 బంతుల్లో 52 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సులు) విధ్వంసకర హాఫ్ సెంచరీ చేశాడు.
India Champions | మరో ఓటమి..
రాబిన్ ఊతప్ప(37) విలువైన పరుగులు చేశాడు. అయితే అంబటి రాయుడు (0), సురేశ్ రైనా (11), యువరాజ్ సింగ్ (3) పూర్తిగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో డాన్ క్రిస్టియన్(Don Christian) (2/34) ప్రభావితం చేశాడు. బ్రెట్ లీ, డీ ఆర్సీ షాట్ చెరో వికెట్ తీశారు. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఛాంపియన్స్, 19.5 ఓవర్లలో 6 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. కాలమ్ ఫెర్గూసన్ (38 బంతుల్లో 70; 5 ఫోర్లు, 4 సిక్సులు) జట్టును ముందుండి నడిపించాడు. డాన్ క్రిస్టియన్ మరోసారి (39) అద్భుతంగా రాణించాడు. భారత బౌలర్లలో పియూష్ చావ్లా (Piyush Chawla) (3/36), హర్భజన్ సింగ్ (2/33) మెరుగైన ప్రదర్శన కనబర్చినా, చివరి ఓవర్‌లో ఆస్ట్రేలియా విజయాన్ని ఆపలేకపోయారు.
చివరి ఓవర్‌లో 13 పరుగులు కావల్సి ఉండగా, కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఉంటే భారత్ గెలిచేది. కానీ వినయ్ కుమార్ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ టోర్నీలో భారత్ ఆడిన రెండు మ్యాచ్‌లు ఓడింది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా చేతిలో వరుసగా ఓడిపోవడంతో ఇండియా ఛాంపియన్స్(India Champions) పాయింట్స్ టేబుల్‌లో చివరి స్థానానికి పరిమితమైంది. భారత్ జట్టు ఆదివారం ఇంగ్లండ్ ఛాంపియన్స్‌తో, మంగళవారం వెస్టిండీస్ ఛాంపియన్స్‌తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ఇండియా టీం సెమీస్ రేసులో నిలవగలదు. మరి తప్పులను సరిదిద్దుకొని యువరాజ్ అండ్ టీం తిరిగి పుంజుకుంటారా? లేదా చూడాలి.