అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Australia Government | ఆన్‌లైన్ భద్రత, డిజిటల్ హెల్త్ పరిరక్షణ కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2025 డిసెంబర్ 10వ తేదీ నుంచి 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని పూర్తిగా నిషేధించే చట్టాన్ని ఆమోదించింది.
ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ (Australia PM Anthony Albanese) అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఆస్ట్రేలియా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఇలాంటి చట్టాన్ని అమలు చేయబోతోంది. కొత్త చట్టం ప్రకారం.. 16 ఏళ్లలోపు మైనర్లు ఇకపై Facebook, Instagram, TikTok, Snapchat, X (Twitter), YouTube, Reddit, Kick వంటి ప్లాట్‌ఫాంలలో అకౌంట్లు క్రియేట్ చేయడం లేదా వాడడం చట్టవిరుద్ధం అవుతుంది.
Australia Government | పిల్లల భద్రతే లక్ష్యం
ప్రభుత్వం (Australia Government) వెల్లడించిన ప్రకారం.. ఈ చట్టం ప్రధాన ఉద్దేశం పిల్లలను ఆన్‌లైన్ ప్రమాదాలు, సైబర్ బులీయింగ్, సోషల్ మీడియా వ్యసనం, మరియు మానసిక ఒత్తిడి వంటి సమస్యల నుంచి రక్షించడం. మొదట్లో యూట్యూబ్‌కు (YouTube) మినహాయింపు ఇవ్వాలని భావించినా, పరిశోధనల తర్వాత దానిని కూడా నిషేధ జాబితాలో చేర్చారు. ఈ చట్టాన్ని అమలు చేయడం పూర్తిగా సోషల్ మీడియా కంపెనీల బాధ్యతగా నిర్ణయించారు. 16 ఏళ్లలోపు పిల్లలు తమ ప్లాట్‌ఫాంలలో అకౌంట్లు సృష్టించకుండా ఉండేందుకు ఆయా కంపెనీలు సమర్థవంతమైన వయస్సు ధ్రువీకరణ వ్యవస్థలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
రూల్స్‌ను పాటించకపోతే, ఆ సోషల్ మీడియా సంస్థలకు గరిష్టంగా 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ.410 కోట్లు) వరకు భారీ జరిమానా విధించే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. ఆస్ట్రేలియా తీసుకున్న సంచలన నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పిల్లల మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా (Social Media) ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్న డెన్మార్క్, అమెరికా కొన్ని రాష్ట్రాలు, అలాగే న్యూజిలాండ్ వంటి దేశాలు ఈ చట్టాన్ని గమనిస్తున్నాయి. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఇప్పటికే ఆస్ట్రేలియా మోడల్‌కు మద్దతు ప్రకటించారు.
