అక్షరటుడే, వెబ్‌డెస్క్: TGPSC OTR Update | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కీలక నిర్ణయం తీసుకుంది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) సిస్టమ్‌లో అభ్యర్థులందరి డేటాను తప్పనిసరిగా అప్డేట్ చేసి, ధృవీకరించాలని నిర్ణయించింది.
టీజీపీఎస్సీ నోటిఫికేషన్ల (TGPSC notifications) కోసం గతంలో ఓటీఆర్ విధానం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం.. అభ్యర్థి వివరాలు అన్ని ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతి నోటిఫికేషన్‌కు అన్ని వివరాలు నింపాల్సిన అవసరం లేదు. ఓటీఆర్ నంబర్ ఆధారంగా జాబ్లకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఓటీఆర్ మార్పులు, చేర్పులకు తాజాగా టీజీపీఎస్సీ అవకాశం కల్పించింది.
TGPSC OTR Update | 31.56 లక్షల మంది..
ప్రస్తుతం OTR సిస్టమ్‌లో సుమారు 31.56 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. ఇటీవలి షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ, అభ్యర్థులు పొందిన విద్యార్హతలలో మార్పులు, అభ్యర్థుల వివరాల అప్డేట్ కోసం అభ్యర్థనల దృష్ట్యా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పులు, చేర్పులకు టీజీపీఎస్సీ అవకాశం కల్పించింది. నియామక ప్రక్రియలను వేగంగా పూర్తి చేయడం, ఫలితాలను ముందస్తుగా ప్రకటించడం, నియామక ఉత్తర్వులను సకాలంలో జారీ చేయడం, డేటా వ్యత్యాసాలు, అసంపూర్ణ డాక్యుమెంటేషన్‌తో కలిగే జాప్యాలను నివారించడానికి ఈ చర్య చేపట్టినట్లు కమిషన్ తెలిపింది.
TGPSC OTR Update | వీటిని ధ్రువీకరించుకోవాలి
అభ్యర్థులందరూ వారి వ్యక్తిగత, విద్యా, కేటగిరీ వివరాలను ధ్రువీకరించుకోవాలి. అన్ని అర్హతలు అప్డేట్ చేయాలి. తాజా కలర్ పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్తో సహా అన్ని సంబంధిత సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలి. కమిషన్ అధికారిక వెబ్సైట్ (https://www.tgpsc.gov.in) లో అందుబాటులో ఉన్న లింక్ ద్వారా అప్డేట్ కోసం ఫిబ్రవరి 25 వరకు అవకాశం ఉంది. ప్రతి అభ్యర్థికి ఒక OTR మాత్రమే ఉండాలి. కమిషన్, అభ్యర్థి రద్దు చేసే వరకు OTR చెల్లుబాటులో ఉంటుందని కమిషన్ తెలిపింది. అదనపు అర్హతలు, కరస్పాండెన్స్ చిరునామా, EWS స్థితి, నాన్-క్రీమీ లేయర్ వివరాలు, మొబైల్ నంబర్, ఇమెయిల్ ID మినహా, మిగతా ఫీల్డ్‌లను సవరించడం సాధ్యం కాదు.
అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ పూర్తి వివరాలను అప్డేట్ చేసుకోవాలని కమిషన్ సూచించింది. గడువులోగా అప్డేట్ చేసి, అవసరమైన సర్టిఫికెట్లను అప్లోడ్ చేసే అభ్యర్థులు మాత్రమే నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కమిషన్ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు.