అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Karimnagar | అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కామాంధులు భయపడటం లేదు. పిల్లలు ఇంటి తర్వాత బడిలోనే ఎక్కువ సేపు ఉంటారు. అలాంటి పాఠశాలల్లో సైతం రక్షణ కరువైంది.
బాలికలకు బడుల్లో భద్రత కరువైంది. కొందరు ఉపాధ్యాయులు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు గతంలో అనేకం వెలుగు చూశాయి. తాజాగా కరీంనగర్ (Karimnagar) జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ అమ్మాయిల వాష్‌రూమ్ (Wash Room)లో సీక్రెట్ కెమెరా పెట్టాడు. బాలికల ఫొటోలు తీసి అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్ చేస్తున్నాడు. అటెండర్ నిర్వాకంపై తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు. హెడ్ మాస్టర్ ఫిర్యాదుతో అటెండర్ యాకూబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Karimnagar | తల్లిదండ్రుల ఆందోళన
అమ్మాయిల బాత్రూమ్‌లో అటెండర్ యాకూబ్ సీక్రెట్ కెమెరాను పెట్టాడు. దాని ద్వారా వీడియోలు రికార్డు చేస్తున్నాడు. అయితే ఓ పరికరం మెరుస్తూ కనిపించడంతో బాలికలు అనుమానం వచ్చి చూడగా.. కెమెరాగా గుర్తించారు. దీంతో ప్రధానోపాధ్యాయుడితో పాటు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో తల్లిదండ్రులు బడికి చేరుకొని ఆందోళన నిర్వహించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు యాకూబ్‌ను అరెస్ట్ చేసి, కెమెరాను స్వాధీనం చేసుకున్నారు.
