అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Gujarat ATS | గుజరాత్లో ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాద్ (Hyderabad)కు చెందిన డాక్టర్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
దేశంలో ఉగ్రదాడులకు కుట్ర పన్నిన ముగ్గురిని గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాడులు చేపట్టేందుకు వీరు ఆయుధాలు సరఫరా చేస్తున్నారని చెప్పారు. నిందితుల్లో హైదరాబాద్ నగరానికి చెందిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ ఉన్నారు. కాగా మొహియుద్దీన్ ఫ్రాన్స్‌లో ఎంబీబీఎస్ (MBBS) చదివాడు.
Gujarat ATS | ఇంట్లో సోదాలు
సయ్యద్ అహ్మద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆదివారం హైదరాబాద్‌లోని అతడి ఇంట్లో సోదాలు చేపట్టారు. మొహియుద్దీన్‌కు ISKP సభ్యులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి ఇంట్లో 2గ్లాక్ పిస్టల్స్, 1 బెరట్టా పిస్టల్, 30 లైవ్ క్యాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరపర్చగా.. ఈనెల 18 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది.
Gujarat ATS | ప్రమాదకరమైన విషం తయారీకి యత్నం
కాగా అహ్మదాబాద్-మెహ్సానా హైవేలోని అదాలజ్ టోల్ ప్లాజా సమీపంలో నిఘాలో ఉన్న ప్రధాన నిందితుడు, హైదరాబాద్‌కు చెందిన 35 ఏళ్ల డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కుట్రలో భాగంగా అతను గుజరాత్‌కు ప్రయాణించాడని నిఘా వర్గాలు తెలిపాయి. ఒక పెద్ద ఉగ్రవాద దాడిని అమలు చేయడానికి, అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ ‘రైజిన్’ (రికిన్) అనే అత్యంత ప్రాణాంతకమైన విషాన్ని తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీనికోసం ముడి పదార్థాలు సైతం సేకరించాడన్నారు. అతడి ఫోన్ డేటా ఆధారంగా మరో ఇద్దరు నిందితులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)కు చెందిన 20 ఏళ్ల దర్జీ ఆజాద్ సులేమాన్ షేక్, 23 ఏళ్ల విద్యార్థి మొహమ్మద్ సుహైల్ మొహమ్మద్ సలీమ్‌గా గుర్తించారు. వారు పిస్టల్స్, కార్ట్రిడ్జ్‌లతో కూడిన బ్యాగ్‌ను సయ్యద్‌కు డెలివరీ చేశారని అధికారులు తెలిపారు.
