అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pakistan vs Afghanistan | దాడులు, ప్రతిదాడులతో పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య వివాదం ముదురుతోంది. ఇటీవల కాబూల్‌లో పాక్ దాడి చేసిన నేపథ్యంలో అఫ్ఘాన్ ప్రతి దాడికి దిగింది. శనివారం రాత్రి పాకిస్థాన్ సైనిక స్థావరాలపై తాలిబన్లు దాడి చేసింది.
దీంతో ఇరు దేశాల సరిహద్దులో భారీ ఘర్షణలు చెలరేగాయి. అఫ్గాన్ దాడుల్లో 18 మంది పాక్ సైనికులు హతమయ్యారు. ఈ వారం కాబూల్‌లో పాకిస్థాన్ వైమానిక దాడి తర్వాత ఈ ఉద్రిక్తత తలెత్తిందని రెండు దేశాల భద్రతా అధికారులు తెలిపారు.
Pakistan vs Afghanistan | భీకర దాడులు..
డ్యురాండ్ సరిహద్దు (Durand Line) వెంబడి పాక్, అఫ్గాన్ సైనిక దళాలు ఘర్షణకు దిగాయి. తాలిబాన్ (Taliban) దాడుల్లో ఏకంగా 18 మంది పాక్ సైనికులు మృతి చెందారు. ఇస్లామాబాద్ (Islamabad) అఫ్గాన్ భూభాగంపై వైమానిక దాడులు నిర్వహించిందని ఆరోపిస్తూ తాలిబన్ దళాలు పాకిస్థాన్ దళాలపై సాయుధ ప్రతీకార చర్యలు ప్రారంభించాయి. దక్షిణ ప్రావిన్స్ హెల్మాండ్‌లోని రెండు పాకిస్థాన్ సరిహద్దు పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు, దీనిని స్థానిక అధికారులు ధృవీకరించారు. కునార్, హెల్మాండ్ ప్రావిన్సులకు సమీపంలో సరిహద్దు వెంబడి పలు పాక్ స్థావరాలను స్వాధీనం చేసుకున్నామని అఫ్గాన్ రక్షణ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. బహ్రమ్చా, షాక్జీ, బీబీజానీ, సలేహాన్ జిల్లాలో పాక్, అఫ్ఘాన్ దళాలను ఎదురుకాల్పులకు దిగాయి. మరోవైపు, అకారణంగా కాల్పులకు జరిపిన అఫ్గాన్ దళాలను దీటుగా తిప్పికొడుతున్నామని పాక్ భద్రతా అధికారులు తెలిపారు.
Pakistan vs Afghanistan | ప్రతీకార దాడి
తమ గగతలాన్ని పాక్ ఉల్లంఘించినందుకు ప్రతీకారంగా తాము ఈ దాడులు చేసినట్టు అఫ్గాన్ రక్షణ శాఖ ప్రతినిధి ఇనాయతుల్లా ఖొవరాజ్మీ తెలిపారు. ప్రస్తుతానికి దాడులు ముగిశాయని చెప్పారు. పాక్ ఆయుధ సామగ్రిని, నిర్మాణాలను ధ్వంసం చేశామని తెలిపారు. పాక్ దళాలు దెబ్బతిన్నాయి, వారి వాహనాలను, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మరోసారి పాక్ తమ గగన తలాన్ని ఉల్లంఘిస్తే తమ సాయుధ దళాలు దీటుగా బదులిస్తాయని హెచ్చరించారు. మరోవైపు, నిషేధిత గ్రూప్ తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ సభ్యులకు అఫ్గాన్ అధికారులు ఆశ్రయం ఇస్తున్నారని పాక్ ఆరోపిస్తోంది. పాకిస్థాన్ లోపల ఆ గ్రూప్ ప్రాణాంతక దాడులకు పాల్పడుతుందని ఇస్లామాబాద్ చెబుతోంది. కానీ ఆ ఆరోపణలను అఫ్గాన్ ఖండిస్తోంది. తన భూభాగాన్ని ఇతర దేశాలపై ఉపయోగించడానికి అనుమతించదని చెబుతోంది.
Pakistan vs Afghanistan | పాక్ అభ్యంతరం
భారత్, అప్గాన్ మధ్య బందం బలోపేతమవుతుండడంపై పాకిస్థాన్ అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇరు దేశాలు చేసిన ఉమ్మడి ప్రకటనను దాయాది దేశం ఖండించింది. ఉగ్రవాదం పాకిస్థాన్ అంతర్గత సమస్య అని ముత్తాకి చేసిన వ్యాఖ్యలను కూడా ఇస్లామాబాద్ తిరస్కరించింది. భారతదేశం- అఫ్గానిస్థాన్ ఉమ్మడి ప్రకటనలోని అంశాలపై ఇస్లామాబాద్‌లోని అఫ్గానిస్థాన్ రాయబారికి తన అభ్యంతరాలను తెలియజేసింది.