HomeUncategorizedDelhi CM | కుక్క‌ల కోసమే సీఎంపై దాడి చేశా.. నిందితుడు షాకింగ్ కామెంట్స్..

Delhi CM | కుక్క‌ల కోసమే సీఎంపై దాడి చేశా.. నిందితుడు షాకింగ్ కామెంట్స్..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Delhi CM | ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడికి పాల్పడిన రాజేష్ ఖిమ్జీ ప్రస్తుతం పోలీసు రిమాండ్‌లో ఉన్నాడు. విచారణ మొదటి రోజే అతను చేసిన వ్యాఖ్యలు పోలీసు అధికారులను ఆశ్చర్యానికి గురి చేశాయి. ఢిల్లీ పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. రాజేష్ (Rajesh Khimji) త‌ను దాడి చేయ‌డానికి కార‌ణం ధ్యానస్థితిలో భైరవుడి నుండి వచ్చిన ఆదేశాలే అని చెప్పాడు. రాజేష్ ఖిమ్జీ తరచూ శివాలయంలో శివలింగాన్ని పూజించేవాడట. వీధి కుక్కలపై సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పు ఇచ్చిన‌ సమయంలో, త‌న‌కు శివలింగంలో భైరవుని రూపం కనిపించిందని, ఆ రూపంలో ఒక కుక్క తనను ఢిల్లీకి వెళ్లి, తన అభిప్రాయం చెప్పమని చెప్పిందట.

Delhi CM | రైలులో వ‌చ్చా..

ఈ నేపథ్యంలో, ఖిమ్జీ ఆగస్టు 19న ఉజ్జయినిలోని తన నివాసం నుంచి ఢిల్లీకి బయలుదేరాడు. మరోసారి భైరవుడి రూపంలో కనిపించిన కుక్క తాను చేపట్టే పనికి ధైర్యం ఇచ్చిందని పేర్కొన్నాడు. ఖిమ్జీ ఉజ్జయినీ నుంచి టికెట్ లేకుండానే రైలులో ప్రయాణించి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు (Delhi Railway Station) చేరుకున్నాడు. అక్కడ నుండి సామాన్య ప్రయాణికుల్ని అడిగి, సీఎం రేఖ గుప్తా (Delhi CM Rekha Gupta) నివాసానికి వెళ్లే మార్గం తెలుసుకున్నాడు. మెట్రోలో వెళ్లాల‌ని ప్ర‌య‌త్నించిన కుద‌ర‌క‌, చివరికి ఓ రిక్షాలో సీఎం ఇంటి వద్దకు చేరుకున్నాడు. రిక్షా డ్రైవర్‌కు రూ.50 చెల్లించాడని పోలీసులకు తెలిపారు.

పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో, ఖిమ్జీ ముఖ్యమంత్రికి తన అభ్యర్థన చెప్పినా ఆమె స్పందించలేదని పేర్కొన్నాడు. వీధి కుక్కలను (Street Dogs) తరిమికొట్టవద్దని ఆమెను కోరాను. కానీ స్పందన రాలేదు. అందుకే దాడి చేశాను” అని చెప్పాడు. రాజేష్ ఖిమ్జీ చేసిన ఈ వ్యాఖ్య‌లు నిజమా? లేక దర్యాప్తును తప్పుదారి పట్టించడానికే ఇలా మాట్లాడుతున్నాడా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అతను మానసిక స్థితిగతులపై కూడా విచారణ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ పోలీసుల (Delhi Police) దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో, రాజేష్ ఖిమ్జీ చేసిన కామెంట్స్ అంద‌రి దృష్టిని మరల్చ‌డానికా లేక వేరే ఏదైన కార‌ణం ఉన్నదా అన్నది త్వరలోనే తేలనుంది.