అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. నడిరోడ్డుపై దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల పోలీసులపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడానికి యత్నించిన విషయం తెలిసిందే. తాజాగా మరో రౌడీ షీటర్ నడిరోడ్డు మీద యువకుడిపై కత్తితో దాడి చేశాడు.
హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్ట (Jagadgirigutta)లో యువకుడిపై హత్యాయత్నం జరిగింది. బాల్ రెడ్డి అనే రౌడీ షీటర్, మరో దుండగుడు కలిసి రోషన్ అనే యువకుడిపై దాడి చేశారు. జగద్గిరిగుట్ట బస్టాండ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈ దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Hyderabad | ఇద్దరు రౌడీ షీటర్లే..
రోషన్(26), బాలేశ్వర్ రెడ్డి (23) ఇద్దరు రౌడీ షీటర్లనేనని పోలీసులు తెలిపారు. రోషన్‌పై బాలనగర్ పీఎస్‌లో, బాలేశ్వర్ రెడ్డిపై జగద్గిరిగుట్ట ఠాణాలో రౌడీ షీట్ ఉంది. బాల్‌రెడ్డి తన స్నేహితుడు మహమ్మద్‌తో కలిసి హత్యాయత్నం చేశాడు. అయితే ఈ ముగ్గురు గంజాయి బ్యాచ్ అని సమాచారం. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Hyderabad | గంజాయి బ్యాచ్ వీరంగం
రాజేంద్రనగర్ (Rajendranagar)లో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. గంజాయి మత్తులో ఉన్న కొందరు పార్క్ చేసి ఉన్న కారు అద్దాలు ధ్వంసం చేశారు. ప్రశ్నించిన యజమానితో దురుసుగా ప్రవర్తించారు. “నాకు పగలగొట్టాలనిపించింది, అందుకే పగలగొట్టాను. ఎక్కువ మాట్లాడితే కారు మొత్తం తగలబెడతాను” అంటూ సదరు యజమానిని ఉల్టా బెదిరించారు. అడ్డుకునేందుకు వచ్చిన స్థానికులపై దాడికి యత్నించారు.
నగరంలో ఇటీవల కత్తిపోట్లు, కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు గంజాయి బ్యాచ్‌లు వీరంగం చేస్తున్నాయి. పలువురు యువత గంజాయికి బానిసలుగా మారి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. రోడ్డుపై న్యూసెన్స్ చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాహనాలకు అడ్డంగా వెళ్తున్నారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
