అక్షరటుడే, వెబ్డెస్క్ : Jayashankar Bhupalpally | జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో జరిగిన అమానుష ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. హాస్టల్ వార్డెన్ (Hostel Warden) భవాని డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినిని బూతులు తిడుతూ, కర్రతో పాటు చేతులతో విచక్షణారహితంగా చితకబాదిన ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియా (Social Media)లో వైరల్గా మారింది.
ఈ ఘటన గత నెల 24న జరిగినప్పటికీ, వీడియో బయటకు రావడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.సమాచారం ప్రకారం.. హాస్టల్లో స్వల్ప కారణంతో వార్డెన్ భవానికి, సదరు విద్యార్థినికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన వార్డెన్, విద్యార్థినిని అని కూడా చూడకుండా కర్ర తీసుకుని దాడికి దిగింది.
Jayashankar Bhupalpally | విద్యార్ధినిపై దాడి..
తోటి విద్యార్థినులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా పట్టించుకోకుండా, దుర్భాషలాడుతూ కనికరం లేకుండా కొట్టినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దృశ్యాలను భయంతోనే అక్కడున్న విద్యార్థినులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది.వార్డెన్ భయంతో ఈ విషయం దాదాపు నెల రోజుల పాటు బయటకు రాలేదు. అయితే తాజాగా వీడియో వైరల్ (Video Viral) కావడంతో హాస్టల్లో జరుగుతున్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదువుకునేందుకు పంపిన పిల్లలు హాస్టళ్లలో మత బోధనలు, శారీరక వేధింపులకు గురవుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది తొలిసారి కాదు. ఇదే ఎస్సీ గర్ల్స్ హాస్టల్ (SC Girls Hostel) గతంలోనూ వివాదాల్లో చిక్కుకుంది. రెండు నెలల క్రితం హాస్టల్లో విద్యార్థినులకు మత బోధనలు జరుగుతున్నాయనే ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆ ఘటన మరువక ముందే ఇప్పుడు విద్యార్థినిపై భౌతిక దాడి జరగడం మరింత సంచలనంగా మారింది.వీడియో వైరల్ కావడంతో ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, పలు దళిత సంఘాలు హాస్టల్ ముందు ఆందోళన చేపట్టాయి. వార్డెన్ భవానిని వెంటనే విధుల నుంచి తొలగించడంతో పాటు, ఆమెపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే జిల్లాలోని అన్ని హాస్టళ్ల పరిస్థితులపై సమగ్ర విచారణ జరపాలని ఉన్నతాధికారులను కోరారు. బాధిత విద్యార్థినికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని సంఘాల నేతలు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది