అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai chaitanya | నగరంలోని మూడో టౌన్ పరిధిలో ఏటీఎంలో (ATM) చోరీకి ప్రయత్నించిన నిందితులను త్వరగా పట్టుకోవాలని సీపీ సాయిచైతన్య పోలీసులను ఆదేశించారు.
చోరీయత్నం జరిగిన చంద్రశేఖర్ కాలనీలోని (Chandrasekhar Colony) బ్యాంక్ ఆఫ్ ఇండియా (bank Of India) ఏటీఎంను సీపీ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏటీఎంల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని పోలీసులకు సూచించారు. క్లూస్‌టీం (Clues Team), సీసీఎస్ టీం (CCS Team) అధికారులు కేసు పరిశోధనలో అలర్ట్‌గా ఉండాలని సీఐ శ్రీనివాస్ రాజు, ఎస్సై హరిబాబుకు ఆదేశాలు జారీ చేశారు.
నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో సోమవారం అర్ధరాత్రి గ్యాస్‌కట్టర్‌తో ఏటీఎంలో నగదు చోరీ చేసేందుకు దుండగులు ప్రయత్నించిన విషయం విదితమే. ఏటీఎంలో అలర్ట్ మెసేజ్ పోలీసులు అందుకుని ఘటనా స్థలానికి చేరుకోగా.. పోలీసుల రాకను గమనించిన దుండగులు వ్యాన్‌లో అక్కడి నుంచి ఉడాయించారు. పాల్దా శివారులో వ్యాన్‌ను గ్యాస్ కట్టర్‌ను వదిలేసి అక్కడినుంచి వెళ్లిపోయారు.
