అక్షరటుడే, ఇందూరు: ATM robbery attempt | ఇటీవలి ఏటీఎం చోరీకి యత్నించే ఘటనలు ఎక్కువైపోతున్నాయి. తరచూ ఇలాంటి వార్తలు వెలుగుచూస్తున్నాయి.
పక్కా ప్లాన్‌తో దొంగలు రెక్కీ నిర్వహించి ఏటీఎంల చోరీకి పాల్పడుతున్నారు. తాజాగా మరో ఘటన నిజామాబాద్ జిల్లా (Nizamabad district) కేంద్రంలో చోటుచేసుకుంది.
నిజామాబాద్ మూడో పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎం చోరీ యత్నం జరిగింది. చంద్రశేఖర్ కాలనీలో ముగ్గురు దుండగులు మారుతి వ్యాన్‌లో వచ్చి ఏటీఎంలోకి చొరబడ్డారు.
గ్యాస్ కట్టర్ తో (gas cutter) ఏటీఎం మిషన్(ATM machine)ను పగులగొట్టారు. ఏటీఎం యంత్రాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు.
నగదు దొంగిలించే ప్రయత్నం చేయగా.. అప్పుడే పెట్రోలింగ్ సిబ్బంది అటుగా రావడంతో పోలీసులను చూసి దుండగులు వ్యాన్‌లో పారిపోయారు.

ATM robbery attempt | అర్ధరాత్రి హై అలర్ట్..
వెంటనే పెట్రోలింగ్ సిబ్బంది వారిని వెంబడిస్తూనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు ఆయా ఠాణాల పోలీసులను అప్రమత్తం చేశారు.
అలా మూడో టౌన్‌తో పాటు నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది దుండగులను వెంబడించారు. వారు బాసర వైపు వ్యాన్‌లో పారిపోతుంటే.. వెనుక పోలీసులు ఛేజింగ్ చేశారు.
దీంతో నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాల్దా గ్రామం వద్ద దుండగులు వ్యాన్‌ను వదిలిపెట్టి పారిపోయారు. అప్పటికే అన్ని దిక్కుల నుంచి నిజామాబాద్ డివిజన్ పోలీసులు చుట్టుముట్టారు.
దీంతో దుండగులు వాహనం వదిలిపెట్టి, చీకట్లో పరుగులు తీశారు. దుండగుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసులకు పాల్దా గ్రామస్థులు కూడా సహకారం అందిస్తున్నారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. కొత్తవారు ఎవరైనా కనబడితే సమాచారం అందించాలని కోరారు.
ATM robbery attempt : మహారాష్ట్ర పాసింగ్..
ఏటీఎం చోరీ దుండగులు వదిలిపెట్టి వెళ్లిన వ్యాన్ మహారాష్ట్రలో రిజిస్ట్రేషన్ అయి ఉంది. అంటే దొంగలు మహారాష్ట్ర(Maharashtra) నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది.
వ్యాన్‌లో గ్యాస్ కట్టర్ పరికరాలు పూర్తిగా ఉన్నాయి. ఏటీఎం యంత్రాన్ని పగులగొట్టడానికి కావలసిన పరికరాలు వాహనంలో ఉన్నాయి.
దీనిని బట్టి చూస్తే.. దుండగులు ముందే రెక్కీ నిర్వహించి, పక్కా ప్లాన్‌తో చోరీకి యత్నించినట్లుగా తెలుస్తోంది. నవీపేట పరిధిలోనే ఇటీవల ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.
నవీపేట్‌లోని రాంపూర్ రోడ్డులో ఉన్న SBI Bank ATM లో (ఆగస్టు 12) అర్ధరాత్రి తర్వాత ఓ వ్యక్తి ఏటీఎం యంత్రాన్ని పగులగొట్టి నగదు దొంగిలించే ప్రయత్నం చేశాడు.
ఆదిలాబాద్‌లోనూ గత నెలలో చోరీ జరిగింది. పట్టణంలోని రామ్‌నగర్ కాలనీలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలోకి దొంగలు చొరబడ్డారు. సీసీ కెమెరాలకు బ్లాక్ స్పే కొట్టారు.
అనంతరం గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇంకా నిందితుల జాడ తెలియరాలేదు.
హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో (Jeedimetla) సైతం దొంగలు ఇటీవల ఇదే తరహాలో ఏటీఎంలను చోరీ చేశారు.
జీడిమెట్లలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) ఏటీఎం సెంటర్లోకి జులై 8న అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు. గ్యాస్ కట్టర్‌తో మూడు ఏటీఎం మిషన్లను ధ్వంసం చేసి రూ.34 లక్షలు ఎత్తుకెళ్లారు.
కాగా.. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. హరియాణాకు చెందిన ముఠా ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించి నిందితులను అరెస్టు చేశారు.
