అక్షరటుడే, ఆర్మూర్ : Armoor | ట్రావెల్ ఏజెంట్ చేతిలో మోసపోయిన యువకుడికి ప్రవాస భారతీయుల సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు అండగా నిలిచారు. రూ.2 లక్షల నగదు రికవరీ చేయించి బాధితుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
మెండోరా మండలం (Mendora Mandal) వెల్కటూర్‌కు చెందిన వెంకటేష్ ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలనే ఆలోచనతో నందిపేట్ మండలంలోని (Nandipet Mandal) ఒక సబ్ ఏజెంట్‌ను సంప్రదించాడు. అతను రూ.3 లక్షలు తీసుకొని విజిట్ వీసాపై (Visit Visa) రష్యాకు పంపాడు. అక్కడ సరైన ఉద్యోగం లేక అక్కడే ఉండి ఇతర పనులు చేసుకోవడానికి ధ్రువీకరణ పత్రాలు కూడా ఇప్పించకపోవడంతో అర్ధాంతరంగా 15 రోజులకే ఇంటికి తిరిగి వచ్చాడు.
దిక్కుతోచని స్థితిలో ఆర్మూర్‌లోని ‘ప్రవాస భారతీయులు సంక్షేమ వేదిక’ అధ్యక్షుడు కోటపాటి నరసింహ నాయుడును సంప్రదించాడు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి సాయం కోరడంతో ఆయన స్పందించారు. పూర్తి వివరాలు తెలుసుకున్న కోటపాటి సదరు ఏజెంట్‌ను పిలిపించి బాధితుడు వెంకటేష్‌కు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా చెప్పారు. నష్టపరిహారం చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొనడంతో.. సదరు ఏజెంట్ రూ.2 లక్షలు బాధితుడికి అప్పజెప్పాడు. దీంతో కోటపాటికి బాధితుడు వెంకటేష్ కృతజ్ఞతలు తెలియజేశాడు.