అక్షరటుడే, వెబ్‌డెస్క్: assignment lands | అసైన్డ్ భూములను సాధారణంగా నిరుపేదలకు కేటాయిస్తారు. ఎలాంటి జీవనాధారం లేని వారికి వ్యవసాయం చేసుకొని ఉపాధి పొందేందుకు వీలుగా సర్కారు భూములను అసైన్డ్ కింద అప్పగించి హక్కులు కల్పిస్తారు. కాగా.. కొందరు పెద్దలు వీటిపై కన్నేశారు. అసైన్డ్ భూములను (assignment lands) గద్దల్లా కాజేస్తున్నారు. పేదలకు అసైన్ చేసిన భూములను దొడ్డిదారిలో తమ పేర్లపై బదలాయించుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధమని తెలిసి కూడా.. అక్రమంగా కొనుగోలు చేస్తూ.. తమ వశం చేసుకుంటున్నారు.
అమెరికాలో స్థిరపడిన నిజామాబాద్ జిల్లా వాసి.. ఇక్కడి అసైన్డ్ భూములపై కన్నేశాడు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి చెందిన సదరు ‘ఎన్నారై రెడ్డి’ అసైన్డ్ భూములను తన బినామీల పేరిట కొనుగోలు చేస్తున్నాడు. అసైన్డ్ భూములను క్రయవిక్రయాలు చేయకూడదనే నిబంధనలున్నా వాటిని తుంగలో తొక్కి సొంతం చేసుకుంటున్నాడు. ఇలా ఇప్పటికే వందల ఎకరాలు తన బినామీల పేరిట కొన్నట్లు సమాచారం. జక్రాన్‌పల్లి మండలం పడకల్లో 12 ఎకరాలు, డిచ్‌పల్లితో 5 ఎకరాలు, హాసాకొత్తూర్‌లో మరో 20 ఎకరాలు, మరో మండలంలో 30 ఎకరాల అసైన్డ్ భూమిని తన కుటుంబీకులు, బినామీల పేరిట కాగితాలపై బదలాయించుకున్నట్లు తెలిసింది.
assignment lands | పెద్ద ఎత్తున హవాలా..
అసైన్డ్ భూములతో పాటు పట్టా భూములను సైతం సదరు రెడ్డి గారు కూడకట్టుకున్నట్లు సమాచారం. దీని కోసం యూఎస్‌లో ఎన్నారైగా స్థిరపడిన అతగాడు.. భూములు కొనే సమయంలో కోట్లాది రూపాయలు హవాలా చేయించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో హవాలకు పాల్పడడంతో పాటు బినామీల పేరిట భూములు కొనుగోలు చేశాడు. వాటిల్లో వెంచర్ వేస్తున్నట్లు సమాచారం. తాజాగా నందిపేట మండలంలోని ఓ వెంచర్ వేసినట్లు తెలిసింది.